ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మీద ఎంత హైప్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాలుగేళ్ల తర్వాత ఈ రెండు టీమ్స్ వన్డే ఫార్మాట్‌లో తలపడుతున్నాయి. అందుకే అందరూ ఈ మ్యాచ్ కోసం తెగ ఎదురు చూశారు. అయితే ఈ టోర్నీ కేవలం భారత్, పాక్ జట్ల మధ్యనే జరగడం లేదరి రోహిత్ శర్మ అన్నాడు. మిగతా టీమ్స్ కూడా ఉన్నాయని మర్చిపోకూడదని చెప్పాడు.
పాక్‌తో మ్యాచ్‌పై బాగా ఫోకస్ పెట్టారా? అని రోహిత్‌ను ప్రశ్నించగా.. ఈ టోర్నీలో ఆడే అన్ని జట్లు ముఖ్యమేనని, వాటితో జరిగే అన్ని మ్యాచులపై తాము ఫోకస్ పెడతామని చెప్పాడు. అలాగే ఈ టోర్నీలో ఫేవరెట్ ఎవరు? అనే ప్రశ్నపై కూడా సూటిగా సమాధానం ఇచ్చాడు. ఈ ట్రోఫీని ఎవరైనా గెలిచే అవకాశం ఉందని, కాబట్టి ఏదో ఒక జట్టును ఫేవరెట్ అని చెప్పలేమని అన్నాడు.

'ఆసియా కప్ కేవలం భారత్, పాకిస్తాన్ మధ్యనే జరుగుతుందని అనకూడదు. మిగతా టీమ్స్ కూడా పోటీలో ఉన్నాయి. గతేడాది శ్రీలంక ఈ ట్రోఫీ గెలిచింది. వాళ్లు అద్భుతంగా ఆడారు. కాబట్టి ఏ ఒక్క టీంను పోటీలో లేదని చెప్పలేం. ఎవరైనా ఆసియా కప్ గెలవచ్చు. ఇది ఎప్పుడూ ఒక టీం గురించి కాదు. పాల్గొంటున్న అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకోవాలి' అని చెప్పాడు.
గతేడాది ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో భారత్ గెలవగా.. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ విజయం సాధించి, టోర్నీ ఫైనల్ చేరింది. అయితే ఫైనల్‌లో పాక్‌ను ఓడించిన శ్రీలంక ట్రోఫీ ముద్దాడింది. ఇక ఈసారి ఆసియా కప్‌ను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుగా ఓడించింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తోనే తలపడనుంది.
ఆసియా కప్‌తోపాటు వరల్డ్ కప్ కోసం భారత్ ఎలా ప్రిపేర్ అవుతుందని రోహిత్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆసియా కప్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టామని చెప్పాడు. వరల్డ్ కప్‌కు ముందు కొన్ని విషయాలపై క్లారిటీ అవసరమని, ఆసియా కప్‌లో అది దొరుకుతుందని ఆశిస్తున్నామని అన్నాడు.