వరల్డ్ కప్ వేదికగా జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 15న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే నవరాత్రి ఉత్సవాల కారణంగా ఆ రోజున మ్యాచ్‌కు రక్షణ కల్పించలేమని స్థానిక పోలీసులు తెలిపారు.
దీంతో ఈ మ్యాచ్ తేదీ మారుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో పలు మార్పులు ఉంటాయని, మూడు సభ్య బోర్డులు తేదీల మార్పుల కోసం డిమాండ్ చేశామని తెలిపాడు. ఈ డిమాండ్ కేవలం భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి కాదని కూడా జై షా చెప్పాడు.

ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను ఒక్క రోజు ముందుకు.. అంటే అక్టోబర్ 14వ తేదీకి మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసిందట. దీనికి పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను కూడా అక్టోబర్ 10వ తేదీకి మార్చినట్లు తెలుస్తోంది.
పాత షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అక్టోబర్ 12వ తేదీన జరగాలి. ఈ షెడ్యూల్ మార్పులను ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. వీటిని పీసీబీకి ఐసీసీ పంపగా.. పాక్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపిందట. నవరాత్రి ఉత్సవాల తొలిరోజైన అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రత ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతోనే.. ఈ మ్యాచ్ తేదీ మారినట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ అలాంటిదేం లేదని.. ఈ మ్యాచ్ తేదీ మార్చడానికి, నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి సంబంధం లేదని జై షా వెల్లడించాడు. ఐసీసీలో ఫుల్ మెంబర్లుగా ఉన్న పలు బోర్డుల అభ్యర్థన మేరకే వరల్డ్ కప్ షెడ్యూల్ తేదీ మార్చినట్లు చెప్పాడు. ఇలా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తేదీ మార్చడం వల్ల.. ఆ రోజు జరిగే మిగతా మ్యాచులపై తీవ్రమైన ప్రభావం పడనుంది.
అక్టోబర్ 14న కివీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతుంది. అదే రోజున ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ కూడా ఆడతాయి. అదే రోజున ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌ను అంతకుముందు తేదీకి మారుస్తారని తెలుస్తోంది.