టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ చేసిన కొన్ని కామెంట్స్ తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని, అవి చాలా వింతగా ఉన్నాయని అన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ కోసం టీమిండియాను ప్రకటించినప్పుడు ప్రెస్ మీట్‌లో రోహిత్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాటర్లు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయాలని హిట్‌మ్యాన్ అన్నాడు.
ఈ మాటలు వింతగా ఉన్నాయని, అది కరెక్ట్ కాదని లెజెండరీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ అన్నాడు. 'నేను ఈ స్థానంలోనే ఆడతాను. ఈ నెంబర్‌లో నేను బాగా రాణిస్తాను అని ఎవరూ అనకూడదు. ఏ నెంబర్‌లో అయినా ఆడగలిగే ప్లేయర్లు మాకు కావాలి. ప్రతి ప్లేయర్‌కు ఇదే చెప్తూ వస్తున్నాం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. గత మూడు, నాలుగేళ్లుగా ఈ మాటలు చెప్తున్నాం' అని రోహిత్ అన్నాడు.

ఈ మాటలు అర్థం పర్థం లేని వని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ అభిప్రాయంతో ఈ వరల్డ్ కప్ హీరో పూర్తిగా విభేదించాడు. జట్టులో నిలకడ ముఖ్యమని, ఇలాంటి ప్రయోగాలు కాదని సూచించాడు. 'బ్యాటింగ్ ఆర్డర్‌ను మాటి మాటికీ మార్చేస్తూ ఉంటే ఎవరికీ ఈ జన్మలో కాన్ఫిడెన్స్ రాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఒకరిద్దరి స్థానాలు మారిస్తే తప్పులేదు. కానీ ప్రతి ఆటగాడికీ జట్టులో తన పాత్ర ఏంటో క్లారిటీ ఉండాలి' అని మదన్ లాల్ స్పష్టం చేశాడు.
'మ్యాచ్‌లో పరుగులు చేయడానికి తాము ఏం చేయాలనే విషయంలో ప్లేయర్లకు స్పష్టత ఉండాలి. టీ20ల్లో అయితే క్రీజులోకి వెళ్లిన తర్వాత అందరూ ఒకే తరహా బ్యాటింగ్ చేస్తారు. భారీ షాట్లు ఆడటమే ఈ ఫార్మాట్‌లో ముఖ్యం. అన్ని ఫార్మాట్లలో అది సాధ్యం కాదు. అందరూ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ అనడం చూసి నాకు దిమ్మతిరిగిపోయింది' అని చురకలేశాడీ మాజీ లెజెండ్