టీమిండియా యువ హిట్టర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే అరంగేట్రం చేసినా.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి రాలేదు. దీంతో రెండో మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్ మొదటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తనదైన శైలిలో సిక్సర్లు బాది జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా.. ఆ తర్వాత జోరు పెంచి కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో రింకూ కేవలం ఒక్క బౌండరీనే బాదాడు.

కానీ చివరి 5 బంతుల్లో వరుసగా 4,6, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతనికే ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రింకూ సింగ్.. ఐపీఎల్ అనుభవంతోనే ఇంత కాన్ఫిడెంట్‌గా ఆడానని చెప్పాడు.
'నేను సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకున్నా. ఇప్పటికి పదేళ్లుగా క్రికెట్ ఆడుతుంటే.. ఇప్పుడే దానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు ఫీల్ అవుతున్నా. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను బ్యాటింగ్ చేసిన మొదటి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని రింకూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ మ్యాచ్ రింకూతోపాటు మిగతా భారత బ్యాటర్లు కూడా రాణించారు. దీంతో భారత జట్టు 185 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ను టీమిండియా బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 33 పరుగుల తేడాతో జయభేరి మోగించి, సిరీస్ తన ఖాతాలో వేసుకుంది.