ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీసును 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రింకూ సింగ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సంజూ శాంసన్ (40), శివమ్ దూబే (22 నాటౌట్) కూడా విలువైన పరుగులు చేశారు.

ఇక లక్ష్యచేధనలో ఐర్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లోనే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(0), లోర్కాన్ టక్కర్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఆ వెంటనే హ్యారీ టెక్టర్(7)ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది.
అయితే మరో ఓపెనర్ ఆండీ బల్బిర్నీ మాత్రం (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు) చెలరేగాడు. కానీ అతనికి మరే బ్యాటర్ సహకారం అందించలేకపోయారు. చివర్లో మార్క్ అడయార్ (23) మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసిన ఐర్లాండ్ ఓడిపోయింది.
ఈ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ రోజు నేను ఇంకొంత వేగంగా బౌలింగ్ చేయగలిగా. పిచ్ ఉండే కొద్దీ నెమ్మది అవుతుందని భావించి, ఐర్లాండ్ ముందు మంచి టార్గెట్ ఉంచాలని అనుకున్నాం. అలాగే జరిగింది' అని చెప్పాడు.
'ఒక్కోసారి ఆడే పదకొండు మంది టీంను ఎంచుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందరూ కాన్ఫిడెంట్‌గా, నెట్స్‌లో ఆకట్టుకుంటే ఎవరిని ఎంచుకోవాలో వెంటనే ఒక నిర్ణయానికి రాలేం కదా. ఒక కెప్టెన్‌గా ప్లేయర్లు ఎవరినైనా ఇంత కన్నా ఏం అడుగుతాను?' అని అన్నాడు.
'మా అందరికీ టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఉంది. ఇక నాపై ఉండే అంచనాలను నేను అసలు పట్టించుకోను. వీటి వల్ల మనపై ఒత్తిడి పెరుగుతుంది. అదొక భారంగా మారుతుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టడం నేర్చుకోవాలి మళ్లీ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంతకన్నా నాకేం అక్కర్లేదు' అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.