ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. కానీ ఈ గెలుపునకు కారణం సంజూ శాంసన్ చేసిన ఒకే ఒక పరుగని టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయి చెప్పాడు. భారత జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో సంజూ చేసిన పరుగు జట్టుకు విజయం అందించిందని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో 140 పరుగుల టార్గెట్‌తో టీమిండియా బరిలో దిగింది. యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్) ఈ టీంకు మంచి ఆరంభమే అందించారు. అయితే పవర్ ప్లే ముగిసిన మరుసటి ఓవర్లోనే ఐర్లాండ్ పేసర్ క్రెగ్ యంగ్ చెలరేగాడు. వరుస బంతుల్లో జైస్వాల్, తిలక్ వర్మ (0) ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు.

అప్పటికే వర్షం పడే సూచనలు కనిపిస్తున్న క్రమంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్.. యంగ్‌కు హ్యాట్రిక్ దక్కకుండా అడ్డుకున్నాడు. ఆ బంతికి సింగిల్ తీశాడు. నెక్స్ట్ బాల్ బౌన్సర్ కావడంతో గైక్వాడ్ దాన్ని వదిలేశాడు.
అనంతరం వర్షం పెరిగిపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి 6.5 ఓవర్లలో 47/2 స్కోరుతో ఉన్న టీమిండియా డీఎల్ఎస్ విధానంలో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని గురించి మాట్లాడిన బిష్ణోయి.. సంజూ చేసిన సింగిల్ వల్ల తమ టీంకు అదృష్టం కలిసొచ్చిందన్నాడు.
'ఇక్కడి పరిస్థితులు నేను గతంలో వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇక్కడ సంజూ, డీకే ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మ్యాచ్‌లో సంజూ చేసిన సింగిల్ వల్లనే మేం గెలిచాం. సడెన్‌గా రెండు వికెట్లు పడటం టీంను దెబ్బతీసింది. లేదంటే 12 పరుగుల తేడాతో గెలిచేవాళ్లం. ఐర్లాండ్ పొట్టి ఫార్మాట్‌లో బాగా రాణిస్తోంది. ఈ ఫార్మాట్‌లో ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం' అని బిష్ణోయి చెప్పుకొచ్చాడు.