ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లు రాణించారు. ప్రత్యర్థి బ్యాటర్లను భారత పేసర్లు తెగ ఇబ్బంది పెట్టారు. 14 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా తనలో ఏమాత్రం పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు.
యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తొలి టీ20 మ్యాచ్‌లో రాణించాడు. ఇక స్పిన్నర్ రవి బిష్ణోయి కూడా అద్భుతంగానే రాణించాడు. కానీ ఒక్క బౌలర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అతనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ పేలవ ప్రదర్శనను ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

ముఖ్యంగా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని పేరున్న అర్షదీప్.. ఈ మ్యాచ్‌లో 20వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఐర్లాండ్ 8వ నెంబర్ బ్యాటర్ మెకార్తీ చెలరేగాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు అర్షదీప్. ఇదంతా చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీడెక్కడి డెత్ ఓవర్ స్పెషలిస్ట్? అంటూ అర్షదీప్‌ను ఎద్దేవా చేస్తున్నారు.
చివరి ఓవర్లో తేలిపోయిన అర్షదీప్ ఈ మ్యాచ్‌లో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే ఇలా డెత్ ఓవర్లలో తేలిపోవడం అతనికి ఇదేం కొత్త కాదు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ టీ20 సిరీసులో.. నాలుగో మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన అర్షదీప్ ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. చివరకు ఆ మ్యాచ్ ఇండియా నెగ్గడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో అర్షదీప్ సింగ్‌ను ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. పరమ చెత్త బౌలర్‌గా మారిపోయాడంటూ మండిపడుతున్నారు. 'వేస్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్టు అర్షదీప్' అంటూ నెట్టింట జోకులు పేలుస్తున్నారు. 'ఇకపై ఐర్లాండ్ తరఫునే ఆడుకో' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.