ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల మధ్యలో ఆగిపోయిన ఈ మ్యాచ్‌ను రెండు పరుగుల తేడాతో టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. 140 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభమే లభించింది.
కొత్త ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. అయితే జైస్వాల్ అవుటైన వెంటనే తిలక్ వర్మను క్రీజులోకి పంపారు. అతను తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దీనిపై మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టీమిండియా ఇలా తమ బ్యాటింగ్ లైనప్‌లో ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిదని సలహా ఇచ్చాడు. టాపార్డర్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ను కాదని, తిలక్ వర్మను మూడో స్థానంలో ఎందుకు పంపాలని పలువురు ఈ సందర్భంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
విండీస్‌తో జరిగిన సిరీసులో నాలుగో స్థానంలో తిలక్ రాణించాడు. అతన్ని ఇప్పుడు మూడో స్థానంలో పంపడం అనవసరమైన రిస్క్ అని నిపుణుల భావన. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసమే తిలక్‌ను పంపించి ఉంటారనగా.. ఈ మ్యాచ్‌లో టీం తీసుకున్న పలు నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయని అభిషేక్ నాయర్ అన్నాడు.
'తిలక్ నాలుగో స్థానంలో రాణించాడు. సంజూ మూడో స్థానంలో ఆడటం మనం చూశాం. అసలు లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్‌తో ఏం సంబంధం? ఈ టీంలో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. బంతి పెద్దగా టర్న్ అవ్వని ఈ పిచ్‌పై ఎవరాడితే ఏంటి? నాలుగో నెంబర్‌లో బాగా ఆడుతున్న కుర్రాడిని అక్కడే ఆడిస్తే సరిపోతుంది' అని నాయర్ అభిప్రాయపడ్డాడు.
'ఐర్లాండ్ టీంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ కూడా ఆఫ్‌స్పిన్ వేస్తాడు. కానీ ఈ పిచ్‌పై ఎలాంటి టర్న్ లేదు. అప్పుడు లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్ ఎవరు ఆడినా పెద్ద సమస్యేం ఉండదు' అని చెప్పాడు. ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి చెత్త ప్రయోగాలతోనే విండీస్ చేతిలో ఓడామని అంటున్నారు.