వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు భారత జట్టు ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన వాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ ముందు ఏకంగా 444 పరుగుల టార్గెట్ నిలిచింది. దీన్ని ఛేదించడం అంత ఈజీ కాదు.
ఇలాంటి సమయంలో అంపైరింగ్ తప్పిదాల వల్ల భారత ఆటగాళ్లు నష్టపోయారు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాంట్రవర్షియల్ నిర్ణయానికి అవుటయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. ఆ షాట్ సెలెక్షన్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్ వైపు వెళ్లింది.

అతను తన ఎడం చేతి వైపు డైవ్ చేసి మునివేళ్లతో బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బంతి నేలను తాకింది. ఆసీస్ టీం అవుట్ కోసం అప్పీల్ చేసింది. థర్డ్ అంపైర్ ఈ క్యాచ్‌ను కాసేపు పట్టి పట్టి చూశాడు. చివరకు బంతి క్లియర్‌గా కనిపించడం లేదని చెప్పి, గిల్‌ను అవుట్ ఇచ్చేశాడు. ఇది చూసిన అందరూ షాకైపోయారు.
ఈ క్రమంలో తన అవుట్ గురించి శుభ్‌మన్ గిల్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. కామెరూన్ గ్రీన్ క్యాచ్ అందుకున్న ఫొటోను షేర్ చేసిన గిల్.. రెండు భూతద్దాలు, ఆ తర్వాత మొఖంపై చేత్తో కొట్టుకున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఇలా పోస్ట్ చేసిన క్షణాల్లోనే అది నెట్టింట తెగ వైరల్ అయిపోయింది.
ఈ క్యాచ్ తర్వాత కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు స్టేడియంలోని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. 'చీట్.. చీట్..' అంటూ నినాదాలు చేశారు. ఈ నిర్ణయంపై వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్, హర్భజన్ సింగ్ వంటి మాజీ దిగ్గజాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని పని చేస్తున్నాడని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.