ప్రపంచ క్రికెట్‌లో కింగ్ ఎవరు అంటే చటుక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. ఏ దేశంలో సిరీస్ అయినా సరే అద్భుతమైన ఆటతో రాణించిన కోహ్లీ.. ఈ పేరు పొందాడు. అభిమానులు అందరూ అతన్ని అందుకే 'కింగ్ కోహ్లీ' అని పిలుస్తుంటారు. ఇటీవలి కాలంలో అతని వారసుడిగా అందరి మన్ననలు పొందిన ప్లేయర్ శుభ్‌మన్ గిల్.
ఈ ఏడాది ఆరంభం నుంచి అదిరిపోయే ఫామ్‌లో ఉన్న గిల్.. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా అదరగొట్టాడు. పలుమార్లు తన ఐడల్ కోహ్లీ అని కూడా గిల్ చెప్పాడు. దీంతో అతన్ని ఫ్యాన్స్ 'ప్రిన్స్' అని పిలవడం మొదలు పెట్టారు. టీమిండియా భవిష్యత్తు స్టార్ ఇతనే అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇలా బిరుదులు ఇవ్వడంపై తాజాగా కోహ్లీ స్పందించాడు. కింగ్, ప్రిన్స్ అని పేర్లు పెట్టుకోవడం ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు చూడటానికి చాలా బాగుంటుందని చెప్పిన కోహ్లీ.. ఆటగాడిగా తన బాధ్యత వేరన్నాడు. 'ఇలాంటి కింగ్, ప్రిన్స్ ట్యాగ్స్ అన్నీ కూడా పబ్లిక్, ప్రేక్షకులకు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఒక సీనియర్ ప్లేయర్ జాబ్ కుర్రాళ్లు మరింత మెరుగయ్యేలా చూడటమే' అని చెప్పాడు.
ఏ సీనియర్ ప్లేయర్ అయినా అదే చేస్తాడని, తన కెరీర్‌లో ఎదుర్కొన్న కీలక విషయాలు చెప్పి వారికి సూచనలు చేయాలని చెప్పాడు. ఇక గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పిన కోహ్లీ.. తనకు కొత్తగా నేర్చుకోవాలనే తపన చాలా ఎక్కువని, అలాంటి ఆటగాళ్లు ఎప్పటికీ బాగానే ఆడతారని అభిప్రాయపడ్డారు. అత్యున్నత స్థాయిలో ఎక్కువ కాలం క్రికెట్ ఎలా ఆడాలనే విషయంపై గిల్ బాగా ఫోకస్ పెడుతున్నాడని మెచ్చుకున్నాడు.
గిల్ మంచి కుర్రాడని, అద్భుతంగా ఆడుతున్న అతను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా అలాగే ఆడతాడని ఆశిస్తున్నానని కోహ్లీ చెప్పాడు. 'అత్యున్నత స్థాయిలో రాణించే సత్తా, టెంపర్‌మెంట్‌తోపాటు అద్భుతమైన సత్తా కూడా గిల్‌కు ఉంది. మంచి కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు కూడా. ఇక మా రిలేషన్ అంటే.. ఇద్దరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవడంతోపాటు అర్థం చేసుకుంటాం' అని చెప్పాడు.