ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు చాలా ఇబ్బందుల్లో పడింది. తొలి రోజు బంతితో తేలిపోయిన టీమిండియా.. రెండో రోజు పుంజుకుంది. సిరాజ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టు బ్యాటుతోనూ నిరాశ పరిచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13) ఇద్దరూ విఫలమయ్యారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఛటేశ్వర్ పుజారా (14) కూడా ఫెయిలయ్యాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిలబెడతాడని అనుకున్న విరాట్ కోహ్లీ (14)ని మిచెల్ స్టార్క్ బుట్టలో వేసుకున్నాడు. అతను గుడ్ లెంగ్త్‌లో వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో కోహ్లీ తడబడ్డాడు.

ఈ క్రమంలో కోహ్లీ గ్లవ్‌ను తాకిన బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి చిక్కింది. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ఇది చూసిన చాలా మంది ఆ బంతి చాలా కష్టమైన బంతి అని, దాన్ని ఎదుర్కోవడం అసాధ్యమని తేల్చేశారు. అయితే టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాత్రం వేరే అభిప్రాయం వెల్లడించాడు. కోహ్లీ చేసిన పొరపాటు ఏంటో వివరించాడు.
'మరోసారి చూడండి. ప్రస్తుతం ఓవర్‌కు రెండు బౌన్సర్లు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది బ్యాటర్లు ఫ్రంట్ ఫుట్‌పై ఆడుతున్నారు. దీంతో వాళ్లు బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి ఇంకొంత సమయం తీసుకునే ఛాన్స్ ఉండటం లేదు. బ్యాక్‌ఫుట్‌పై ఆడితే చివరి క్షణంలో కూడా బంతిని వదిలేయొచ్చు' అని తెలిపాడీ లిటిల్ మాస్టర్.
'ఆ డెలివరీ అంత కష్టంగా ఎందుకు ఉందంటే.. కోహ్లీ ఫ్రంట్ ఫుట్‌కి బాగా కమిట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. అందువల్లనే చివరి క్షణంలో బ్యాటును వెనక్కు తీసుకోలేకపోయాడు. అదే గనుక అతను బ్యాక్‌ఫుట్‌పై ఉండి ఉంటే? చూడటానికి అది ఆడటం అసాధ్యంలా ఉన్నా.. బ్యాక్‌ఫుట్‌పై ఉంటే దాన్ని వదిలేసే ఛాన్స్ ఉండేది' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
కోహ్లీ తర్వాత వచ్చిన జడేజా (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోకుండానే పెవిలియన్ చేరాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో అజింక్య రహానే (29 నాటౌట్), కేఎస్ భరత్ (5 నాటౌట్) ఉన్నారు. వీళ్లిద్దరి భాగస్వామ్యం మీదనే భారత జట్టు పోరాటం ఆధారపడి ఉంది.