ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు పోరాడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు బంతితో శుభారంభం దక్కలేదు. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. దీంతో రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నా కూడా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టు తేలిపోయింది. ఓపెనర్లతోపాటు ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా కూడా విఫలమయ్యారు. చివర్లో జడేజా, రహానే, శార్దూల్ రాణించడంతో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. మూడో రోజు చివరి సెషన్‌లో భారత బౌలర్లు రాణించారు.

దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్ 123/4 స్కోరుతో నిలిచింది. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆసీస్‌ను ఆలౌట్ చేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎంత టార్గెట్ ఉంచుతుందనేదే ముఖ్యమని దాదా చెప్పాడు.
ఆస్ట్రేలియా కనుక 360 లేదా 370 టార్గెట్ ఉంచినా కూడా భారత్ గెలిచే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డాడు. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీనే అన్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కనుక రాణిస్తే అది పెద్ద టార్గెట్ కాదని తెలిపాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ రాణించలేదన్న సంగతి తెలిసిందే.
మిచెల్ స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ తడబడ్డాడు. మీదకు వచ్చేసిన బంతికి బ్యాటు అడ్డుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని గ్లవ్‌ను తాకిన బంతి నేరుగా సెకండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ వైపు వెళ్లింది. అతను చటుక్కున దాన్ని పట్టేయడంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా అలాగే జరుగుతుందని చెప్పలేం. మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు కోహ్లీ తడబడకుండా 20 పరుగులు చేశాడంటే క్రీజులో కుదురుకున్నట్లే. ఆ తర్వాత అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అదే విషయాన్ని గంగూలీ కూడా తెలిపాడు. అతనితోపాటు మిగతా ప్లేయర్లు కూడా తలో చెయ్యి వేస్తే భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
'ఒకవేళ భారత్ 360 లేదా 370 టార్గెట్ ఛేజ్ చేయాల్సి వస్తే.. భారత్ కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ల దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ ఛేజర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాగే చాలా మంది క్లాస్ ప్లేయర్లున్నారు. కాబట్టి చివరి రెండ్రోజుల్లో ఏమైనా జరగొచ్చు' అని గంగూలీ పేర్కొన్నాడు.