ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తాడో పేడో తేల్చుకొని టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకునేందుకు రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు.
అప్పుడెప్పుడో 2015లో బెంగళూరు టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మళ్లీ ఆ నిర్ణయం తీసుకోవడం ఇదే కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో నెంబర్ వన్ టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటం లేదని రోహిత్ తెలిపాడు. 'అశ్విన్‌ను పక్కన పెట్టడం చాలా కష్టమై నిర్ణయం. మాకు అతను ఒక మ్యాచ్ విన్నర్' అని చెప్పాడు.

'ఇలాంటి కీలక సమయంలో అతన్ని పక్కన పెట్టాల్సి రావడం చాలా బాధాకరం. కానీ పరిస్థితులను బట్టి జట్టుకు ఏది ముఖ్యమో అదే చేయాలి కదా' అని రోహిత్ అన్నాడు. అలాగే వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కలేదని, కేఎస్ భరత్ కొనసాగుతున్నాడని స్పష్టం చేశాడు.
టాస్ గెలిచి ఉంటే తను కూడా బౌలింగ్ ఎంచుకునే వాడినని ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్ అన్నాడు. అలాగే తమ జట్టులో స్కాట్ బోలాండ్ ఆడుతున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్‌లో అతనికి ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం. ఇంతకుమించి తమ జట్టులో పెద్ద మార్పులేవీ లేవని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్