ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు మరోసారి తేలిపోయింది. తొలి రోజు ఆటలో బంతితో విఫలమైన భారత జట్టు.. రెండో రోజు తేరుకుంది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 469 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా భారీ స్కోరు చేసేలా కనిపించింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి విఫలమయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ (13).. బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని వదిలేయడానికి ట్రై చేశాడు. కానీ అది నేరుగా వికెట్లను తాకడంతో తెల్లమొఖం వేశాడు.

ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అనుకున్న ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపు రవీంద్ర జడేజా (48) ఆశలు పెంచాడు. కానీ నాథన్ లియాన్ బౌలింగ్‌లో అతను కూడా పెవిలియన్ చేరాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజింక్య రహానే (29 నాటౌట్), కేఎస్ భరత్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆట చూసిన ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ పెదవి విరిచాడు. రెండో రోజు భారత బౌలింగ్ చూసి టీమిండియా ఈ మ్యాచ్‌పై పట్టు సాధించిందని అంతా అనుకున్నారు. అసలు టీం బలమే బ్యాటింగ్ కాబట్టి, భారత్ కూడా బ్యాటుతో అదరగొడుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
క్రీజులోకి వచ్చిన ప్లేయర్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. దీనిపై స్పందించిన రికీ పాంటింగ్.. 'భారత జట్టు ఈ మ్యాచ్‌పై పట్టు సాధించలేదు. ఇక ఇక్కడి నుంచి ఏం చేసినా టీమిండియా గెలవడం అసాధ్యం' అని తేల్చేశాడు. ఫ్యాన్స్ కూడా మహా అయితే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించొచ్చని, అంతేకానీ గెలవడం మాత్రం ఇక అసాధ్యం అని అంటున్నారు.