మరికొన్ని గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. చివరిసారి కూడా ఈ టోర్నీ ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో న్యూజిల్యాండ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన టీమిండియా ఎలాగైనా మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తమ జట్టు గురించి పలు విషయాలు మాట్లాడాడు.
ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత జట్టు ఎంత కష్టపడింది? టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పుజారా ఫామ్ ఎలా ఉంది? అతను కౌంటీల్లో ఆడటం జట్టుకు ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలు చెప్పాడీ లెజెండ్. 'మేం చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాం. రెండేళ్లు చాలా కష్టపడి ఇక్కడకు చేరుకున్నాం. చాలా ఎత్తుపల్లాలు చూశాం. ఈ మ్యాచ్ ఆడటం కోసమే ఎలాగైనా టాప్-2లో ఉండాలని ప్రయత్నిస్తాం కదా' అని చెప్పాడు.

'ఇక్కడ కౌంటీల్లో పుజారా కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. అందుకే అతనితో కేవలం బ్యాటింగ్ గురించే కాకుండా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. తను ఐపీఎల్ ఆడకపోయినా చాలా క్రికెట్ ఆడాడు. అయినా తను ఆడుతూనే ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఆ విషయం పుజీకి కూడా తెలుసు. కేవలం ఒక ఫార్మాట్ మాత్రమే ఆడే ప్లేయర్‌గా ఉండటం అంత ఈజీ కాదు. నేను నా కెరీర్ చరమాంకంలో అలా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు' అని ద్రావిడ్ వెల్లడించాడు.
ఇక చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే గురించి కూడా ద్రావిడ్ ప్రస్తావించాడు. 'రహానే అద్భుతమైన స్లిప్ ఫీల్డర్. భారత జట్టును మంచి సక్సెస్ దిశగా నడిపిన అనుభవం కూడా అతనికి ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా చాలా టెస్టు క్రికెట్ ఆడుతున్నాయి. ఇంకా టెస్టులు జరిగితే బాగుండని నేను అనుకుంటున్నా. ఇంగ్లండ్‌లో ఎండాకాలం చివర్లో క్రికెట్ ఆడతారు. దీంతో పిచ్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ మేం సరిగా స్పందించాల్సి ఉంటుంది. దానికి సరిపోయే సామర్థ్యం మాకు ఉందనే అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.