ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు వెనుకంజలో ఉంది. ఈ క్రమంలో తాము మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంటుందని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ దారుణంగా పెయిలైన నేపథ్యంలో ఇన్నింగ్స్‌ను చ్కదిద్దిన రహానే.. సెంచరీని త్రుటిలో మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో 129 బంతులు ఎదుర్కొని 89 పరుగులు చేసిన రహానే భారత ఇన్నింగ్స్‌లో ఊపిరి ఊదాడు. ఈ క్రమంలోనే మూడో రోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడాడు. 'ఆస్ట్రేలియా మా ముందు ఎలాంటి లక్ష్యం ఉంచినా ఛేదించాలని అనుకుంటున్నాం' అని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం చక్కగా రాణించిందన్నాడు.

'మేం బాగా బౌలింగ్ చేశాం. అయితే నాలుగో రోజు తొలి సెషన్‌లో కూడా మేం అలాగే రాణించాల్సి ఉంటుంది. లంచ్‌కు ముందు సెషన్ మాకు చాలా కీలకం కానుంది. త్వరగా కొన్ని వికెట్లు తీసుకుంటే.. ఆసీస్‌కు కళ్లెం వేయొచ్చు' అని రహానే వివరించాడు. అదే సమయంలో తాము ఈ మ్యాచ్‌లో పుంజుకున్న విధానాన్ని కూడా మెచ్చుకున్నాడు.
'మేం మంచి కంబ్యాక్ ఇచ్చాం. ప్రస్తుతానికి మా కన్నా ఆసీస్ ముందంజలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ రోజు లేదంటే సెషన్ మనకు అనుకూలంగా సాగితే.. మంచి కంబ్యాక్ ఇవ్వొచ్చని చాలా సార్లు చూశాం. మ్యాచ్ ఇంకా ముగియలేదు. మనం వెనుకబడి ఉన్నప్పుడు ఎంత పట్టుదలగా పోరాడుతున్నాం అనేదే కఠినమైన సవాల్' అని చెప్పుకొచ్చాడు.
జట్టు కోసం కష్టపడేందుకు ఎంత మోటివేట్ అయ్యి ఉన్నామనేది చాలా కీలకం అని రహానే అన్నాడు. 'టెస్టు మ్యాచ్ అంతా మనమే డామినేట్ చేస్తే గెలవడం ఈజీ. కానీ మేం వెనుకపడ్డామని మాకు తెలుసు. కానీ ఒక మంచి సెషన్, మంచి భాగస్వామ్యం దొరికితే మొమెంటం మారిపోతుంది. మేం వెనుకపడినా పుంజుకోగలం అని చాలాసార్లు నిరూపించాం' అని రహానే పేర్కొన్నాడు.
అలాగే ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు పుంజుకొని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ కీలక బ్యాటర్లను భారత బౌలర్లు అవుట్ చేశారు. దీంతో ఆ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 124 పరుగులతో నిలిచింది. క్రీజులో లబుషేన్, కామెరూన్ గ్రీన్ ఉన్నారు. వీళ్ల వికెట్లు తీసుకుంటే ఆ తర్వాత బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవరు.