ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు పోరాడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు బంతితో శుభారంభం దక్కలేదు. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. దీంతో రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నా కూడా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టు తేలిపోయింది. ఓపెనర్లతోపాటు ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా కూడా విఫలమయ్యారు. చివర్లో జడేజా, రహానే, శార్దూల్ రాణించడంతో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ చేసిన ఒక పని తెగ వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్లు యమా డేంజరస్‌గా బౌలింగ్ చేశారు. రహానే, భరత్, శార్దూల్ ముగ్గురూ కూడా వీళ్ల బౌలింగ్‌లో దెబ్బలు తిన్నారు. గంటలకు 140 కిలోమీటర్లపైగా వేగంతో వస్తున్న డ్యూక్ బాల్.. నేరుగా వచ్చి చేతికో, ఛాతీకో తగిలితే ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. శార్దూల్‌కు ఇదే అనుభవం ఎదురైంది.
ప్యాట్ కమిన్స్ వేసిన షార్ప్ డెలివరీలు శార్దూల్ కుడి చేతికి గట్టిగా తాకాయి. ఇలా రెండుసార్లు జరగడంతో నొప్పితో విలవిల్లాడిన శార్దూల్.. ఒక ఐడియా వేశాడు. డగౌట్ నుంచి ఎక్స్‌ట్రా ఆర్మ్ గార్డ్ ఒకటి తెప్పించుకొని, తన కుడిచేతికి తగిలించుకున్నాడు. సాధారణంగా ఆర్మ్ గార్డ్‌ను కుడిచేతి వాటం బ్యాటర్లు ఎడమ చేతికి, ఎడం చేతి వాటం బ్యాటర్లు కుడి చేతికి వేసుకుంటారు.
కానీ శార్దూల్ రెండు చేతులకు రెండు ఆర్మ్ గార్డులతో జాగ్రత్తగా ఆడాడు. అతను ఇలా చేసినప్పుడు కామెంటరీ బాక్సులో ఉన్న రికీ పాంటింగ్, దినేష్ కార్తీక్ ఇద్దరికీ ఇద తెగ నవ్వు తెప్పించింది. 'నేను ఇలా జరగడం ఎప్పుడూ చూడలేదు' అని పాంటింగ్ నవ్వేశాడు. దీనికి బదులిచ్చిన డీకే తను కూడా ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పాడు.