డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు తడబడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు బంతితో సరైన ఆరంభం దక్కలేదు. ఆ తర్వాత బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా టీమిండియ టాపార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. ఇలాంటి సమయంలో జట్టును రహానే, శార్దూల్ ఆదుకున్నారు.
రహానే అయితే ఏకంగా 89 పరుగులు చేశాడు. అతనితోపాటు చక్కగా శార్దూల్ కూడా రాణించడంతో భారత జట్టు పుంజుకునేలాగే కనిపిస్తోంది. కేవలం 71 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయిన టీమిండియా.. రహానే, శార్దూల్ పుణ్యమా అని కోలుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ కూడా చెక్కు చెదరకుండానే ఇరగదీశాడు. టాపార్డర్ బ్యాటర్లు కనీసం కుదురుకోవడానికి ఇబ్బంది పడిన చోటునే శార్దూల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన దాదా.. 'ఇంత మంచి ఇన్నింగ్స్ తర్వాత వాళ్లు డగౌట్ వైపు బ్యాటు చూపించారు. ఎందుకంటే కొంచెం కష్టపడి, లైట్‌గా అదృష్టం కలిసొస్తే మంచి స్కోర్లు చేయొచ్చు అని అక్కడున్న వాళలకు చెప్పడానికి' అని మెచ్చుకున్నాడు.
'ముఖ్యంగా రహానే అద్భుతంగా ఆడాడు. శార్దూల్ ఆరంభంలో కొన్ని దెబ్బలు తిన్నాడు. కానీ ఆ తర్వాత అద్భుతంగా రాణించాడు. గతంలో శార్దూల్ ఠాకూర్ విదేశాల్లో చక్కగా రాణించాడు. వీళ్లు రాణించడంతో భారత జట్టు కొంత మెరుగైన స్థితిలో నిలిచింది. హాఫ్ సెంచరీలు పూర్తయిన తర్వాత డగౌట్ వైపు వీళ్లు బ్యాటులు చూపించడం.. అక్కడి వెటరన్లకు మెసేజ్ ఇవ్వడానికే' అని గంగూలీ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా టాపార్డర్‌కు శార్దూల్ ఒక మెసేజ్ పంపాడని గంగూలీ అన్నాడు. ఈ పిచ్‌పై కొంచెం ఓపిక పడితే పరుగులు చేయొచ్చని నిరూపించాడని మెచుకున్నాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సహా టీమిండియా టాప్ బ్యాటర్లు ఎలా రాణిస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.