ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు వెనుకంజలో ఉన్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బౌలింగ్‌లో తేలిపోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఇక టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం అవడంతో టీమిండియా మాత్రం అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. ఈ క్రమంలో ఆసీస్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్తలు భగ్గుమన్నాయి.
ఆసీస్ జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. సౌతాఫ్రికాతో 2018లో టెస్టు మ్యాచ్ గెలిచేందుకు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులు బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు కూడా. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆసీస్ టీ ఇలాంటి తప్పే చేసిందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కామెంట్లు చేసింది పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ. బాల్ ట్యాంపరింగ్ చేసిన తర్వాతనే ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీని ఆసీస్ అవుట్ చేసిందని అలీ ఆరోపించాడు. కొత్త బంతితో 16 ఓవర్లు వేసిన ఆసీస్ బౌలర్లు దాని షేప్ మారిపోయిందని వేరే బంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాడుతున్న డ్యూక్స్ బాల్ చాలా బలంగా ఉంటుందని చెప్పిన అలీ.. ఊరికినే అది షేప్ మారదన్నాడు.
అలాగే పుజారా అవుటైన డెలివరీని జాగ్రత్తగా గమనిస్తే.. బంతి షైనింగ్ ఉన్న వైపుకే బంతి వచ్చిందన్నాడు. దీన్నే రివర్స్ స్వింగ్ అంటామని, కానీ 14వ ఓవర్లోనే డ్యూక్స్ బాల్ రివర్స్ స్వింగ్ అవడం అసాధ్యం అని స్పష్టం చేశాడు. కానీ పుజారా ఇలాంటి డెలివరీకే అవుటయ్యాడని గుర్తుచేశాడు. అలాగే కోహ్లీ కూడా అనూహ్యమైన బౌన్స్‌ను ఊహించక పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.

'గ్రీన్ బౌలింగ్ చేసేప్పుడు షైన్ భాగం పుజారా వైపే ఉంది. అప్పుడు బంతి అతని వైపు రాదు. కానీ అది వచ్చింది. కోహ్లీ విషయంలోనూ అదే జరిగింది. అసలు ఎవరూ దీన్ని గమనించడం లేదా? అంపైర్లు, కామెంటేటర్లు ఏం చేస్తున్నారు. బీసీసీఐకి క్రికెట్ మీద ధ్యాస లేదు. తమ టీం ఫైనల్ చేరిందని సంతోషిస్తోంది అంతే. ఇలాంటి తప్పులు పట్టించుకోకపోతే ఎలా?' అని అలీ నిలదీశాడు.
'అసలు ఏ బంతి అయినా కేవలం 15-20 ఓవర్లు వేయగానే రివర్స్ స్వింగ్ అవుతుందా? కూకబుర్రా బంతి అయితే అవ్వొచ్చేమో? అనుకోవచ్చు. కానీ డ్యూక్స్ బాల్ చచ్చినా అవ్వదు. కనీసం 40 ఓవర్ల వరకు అది బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ఏమైనా రివర్స్ స్వింగ్ దొరుకుతుంది. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నేను షాకవుతున్నా' అని అలీ పేర్కొన్నాడు.