ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు మరోసారి తేలిపోయింది. తొలి రోజు ఆటలో బంతితో విఫలమైన భారత జట్టు.. రెండో రోజు తేరుకుంది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 469 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా భారీ స్కోరు చేసేలా కనిపించింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి విఫలమయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ (13).. బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని వదిలేయడానికి ట్రై చేశాడు. కానీ అది నేరుగా వికెట్లను తాకడంతో తెల్లమొఖం వేశాడు.

ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనకున్న ఛటేశ్వర్ పుజారా (14) కూడా విఫలమయ్యాడు. కామెరూన్ గ్రీన్ వేసిన బంతిని గిల్‌లాగే వదిలేయడానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు అందరూ విరాట్ కోహ్లీ (14)పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియాను గట్టున పడేసే సత్తా కేవలం కోహ్లీకే ఉందని భావించారు.
కానీ కోహ్లీ కూడా విఫలమయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అవడంతో ఆశ్చర్యపోయాడు. మీదకు వచ్చేసిన బంతిని ఏం చేయాలో అర్థం కాక.. బ్యాటును అడ్డుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గ్లవ్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ వైపు వెళ్లింది. అతను దాన్ని గాల్లోకి ఎగిరి చక్కగా పట్టేయడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు.
మిగతా బ్యాటర్లతో పోల్చుకుంటే కోహ్లీ అవుటైన బంతి సడెన్‌గా బౌన్స్ అయిందని, కష్టమైన డెలివరీ అని ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ కోహ్లీ కనుక ముందుకు వంగి ఆడేందుకు (ఫార్వార్డ్ ప్రెస్) రెడీ అవకపోయి ఉంటే.. ఈ బంతిని ఈజీగా తప్పించుకొని ఉండేవాడు. గతంలో కూడా కోహ్లీ ఇలాంటి పొరపాట్లతో దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.
టెస్టుల్లో కోహ్లీ పని అయిపోయిందని, అతను రిటైర్ అయిపోతే మంచిదని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కీలకమైన మ్యాచుల్లో కోహ్లీ చేతులెత్తేస్తున్నాడని, ఇది చూడటం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం చూసిన ఫ్యాన్స్.. మహా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అవుతుందని, భారత్ గెలవడం మాత్రం అసాధ్యమని అంటున్నారు.