ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు మరోసారి తేలిపోయింది. తొలి రోజు ఆటలో బంతితో విఫలమైన భారత జట్టు.. రెండో రోజు తేరుకుంది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 469 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా భారీ స్కోరు చేసేలా కనిపించింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి విఫలమయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ (13) దారుణంగా అవుటయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అతను.. దాన్ని వదిలేయాలని అనుకున్నాడు. కానీ బంతి ఇన్‌స్వింగ్ అవడంతో తెల్లమొఖం వేశాడు.

అతని జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో బంతి నేరుగా వచ్చి వికెట్లను కూల్చింది. దీంతో షాకైపోయిన గిల్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. మరీ ఇంత ఈజీగా గిల్ అవుట్ అయిపోయాడేంటని అంటున్నారు. ఐపీఎల్ కాకపోతే గిల్ ఆడడేమో? అంటూ ట్రోల్ కూడా చేయడం మొదలు పెట్టేశారు.
ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనకున్న ఛటేశ్వర్ పుజారా (14) కూడా విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన అతను కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరూ ఇబ్బంది పెట్టినట్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో గ్రీన్ సక్సెస్ కాలేదు. దీంతో అతని బౌలింగ్‌లో పుజారా బౌండరీ కూడా బాదాడు.
అయితే ఆ తర్వాత కాసేపటికే గ్రీన్ వేసిన బంతిని వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అచ్చం గిల్‌లాగే మిస్ జడ్జ్ చేయడంతో వికెట్లు కూలిపోయాయి. ఇది చూసిన పుజారా చాలా చిరాకుగా పెవిలియన్ బాట పట్టాడు. ఇలా కీలకమైన టీమిండియా బ్యాటర్లు అందరూ విఫలం అవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పుజారా కేవలం కౌంటీల్లోనే బ్రాడ్‌మన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఏదేమైనా భారత జట్టు తేరుకొని పోటీలో నిలబడాలంటే కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే రెండో రోజు ఆట ముగిసే సమయానికే భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో రహానే, భరత్ ఉన్నారు. వీళ్లిద్దరూ అవుటైతే ఇక బ్యాటింగ్ చేసే ప్లేయర్లు కూడా లేరు. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదంలో పడినా పడొచ్చని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.