ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తేలిపోయారు. రెండో రోజు వాళ్లు ఆకట్టుకున్నా.. టీమిండియా బ్యాటర్లు చాలా చెత్త ప్రదర్శన చేశారు. రహానే తప్ప ఇంకెవరూ కనీసం 20 పరుగుల మార్కు కూడా దాటలేదు. అయితే రవీంద్ర జడేజా (48) మాత్రమే కాసేపు ఆకట్టుకున్నాడు.
కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా దూకుడుగా ఆడుతూ ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టిన పేసర్లు ఎవరూ జడేజాకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇలా జడ్డూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆలోచనలో పడిపోయాడు. అప్పుడే జడ్డూనే అడ్డుకోవడానికి స్పిన్నర్ నాథన్ లియాన్‌ను రంగంలోకి దించాడు.

కమిన్స్ వేసిన ఈ ట్యాక్టిక్ పని చేసింది. ఆఫ్‌స్టంప్ ఆవలగా లియాన్ వేసిన బంతిని ఆడబోయిన జడ్డూ.. స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా జడేజా అవుటవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే జడేజాను అవుట్ చేసిన లియాన్ ఆఫ్‌స్పిన్నర్.
ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే టీమిండియాలో జడేజా, అశ్విన్ ఇద్దరూ ఆడతారా? అని తెగ చర్చ జరిగింది. దీనిపై పిచ్‌ను బట్టే నిర్ణయం తీసుకుంటామని రోహిత్ శర్మ చెప్పాడు. ఇక మ్యాచ్ రోజున పిచ్ గమనించిన రోహిత్ శర్మ అండ్ కో.. ఇది పూర్తి పేస్ పిచ్ అని నిర్ణయానికి వచ్చారు. అందుకే అశ్విన్‌ను పక్కన పెట్టేశారు.
కానీ అదే రోజున భారత పేసర్లు తేలిపోయారు. ఇక రెండో రోజున లియాన్ వచ్చీ రావడంతోనే వికెట్ తీసుకున్నాడు. దీంతో అశ్విన్ కనుక ఉండి ఉంటే ఆసీస్ అసలు అంత స్కోరు చేసేది కాదని, రోహిత్ అండ్ కో కనీసం పిచ్‌ను కూడా సరిగా అంచనా వేయలేకపోయారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. లియాన్‌తో పోలిస్తే అశ్విన్ చాలా బెటర్ స్పిన్నర్ అనేది కాదనలేని సత్యం. అలాంటిది లియాన్‌కే వికెట్ దక్కింది.
అలాంటి పిచ్‌పై అశ్విన్ ఏం చేసేవాడో ఊహించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆసీస్ టాప్ బ్యాటర్లు వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి వాళ్లందరూ అశ్విన్ బౌలింగ్‌లో తెగ ఇబ్బంది పడతారు. దానికితోడు ఎడం చేతి వాటం బ్యాటర్లను ఊరికినే అవుట్ చేసే అశ్విన్ ఉండి ఉంటే.. భారీ స్కోరు చేసిన ట్రావిస్ హెడ్ పరిస్థితి ఏంటి? అంటున్నారు. ఏదేమైనా జట్టు ఎంపికలో టీమిండియా తప్పులో కాలేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.