డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆటలో భారత జట్టు దారుణంగా తేలిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. ఆరంభంలో ఆసీస్ బ్యాటర్లను కొంత ఇబ్బంది పెట్టింది. మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ చెరో ఎండ్ నుంచి అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.
ఒకానొక సమయంలో 76/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్ ఇబ్బందుల్లో ఉన్నట్లే కనిపించింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ చెలరేగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 146 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) కూడా చాలా సంయమనం పాటించాడు. దీంతో భారత బౌలర్లు చాలా అలసిపోయినట్లు కనిపించారు.

ముఖ్యంగా ఉమేష్ యాదవ్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయని ఈ పేసర్ దాదాపు 4 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇక శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసుకున్నా కూడా 4.2 ఎకానమీతో ధారాళంగా పరుగులిచ్చాడు. ట్రావిస్ హెడ్ ఊచకోతకు తల్లడిల్లిన వీళ్లిద్దరూ మరీ దారుణంగా పరుగులు ఇచ్చేశారు.
ఇలా భారత జట్టు తేలిపోవడంలో కెప్టెన్సీ లోపం కూడా ఉంది. సరైన ఫీల్డ్ సెట్టింగ్‌లు పెట్టడంలో రోహిత్ విఫలమయ్యాడు. అలాగే సమయం చూసి బౌలింగ్ మార్పులు చేయలేకపోయాడు. అతని కెప్టెన్సీలో బౌలర్లు నీరసంగా, అలిసిపోయి కనిపించారని ఫ్యాన్స్ అంటున్నారు. కెప్టెన్‌గా రోహిత్ ఫెయిల్ అవడం వల్లనే తొలి రోజు ఆసీస్ ఆధిపత్యం చెలాయించిందని మండిపడుతున్నారు.
ఒకప్పుడు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతనొక్కడే జట్టు మొత్తంలో ఉత్సాహం నింపేవాడని, కానీ రోహిత్ కెప్టెన్సీ చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. కోహ్లీ కెప్టెన్సీని విమర్శించిన వారిపై కూడా ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రిటైర్ అయ్యే వరకు కోహ్లీనే టెస్టు కెప్టెన్‌గా ఉంచాల్సిందని అంటున్నారు. ఐపీఎల్ గెలిచినంత ఈజీగా ఐసీసీ ట్రోఫీ గెలవచ్చని రోహిత్ అనుకుంటే అది చాలా తప్పని కొందరు హితబోధ చేస్తున్నారు. మరి రెండో రోజైనా భారత జట్టు పుంజుకొని పోటీలోకి వస్తుందేమో చూడాలి.