భారత్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుకు అవమానం జరిగింది. మూడో రోజు ఆటలో భారత జట్టు బ్యాటింగ్ తుది దశకు చేరింది. అప్పటికే ఫాలో ఆన్ ప్రమాదం తప్పించుకున్న భారత్.. ఆ తర్వాత ఎన్ని పరుగులు చేయగలమా? అని చూస్తోంది. అయితే 69వ ఓవర్ వచ్చే సరికి ఆసీస్ కేవలం ఒక్క వికెట్ తీసుకోవాల్సి వచ్చింది.
క్రీజులో మహమ్మద్ షమీ, సిరాజ్ ఉన్నారు. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న కామెరూన్ గ్రీన్ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను వేసిన డెలివరీని సిరాజ్ సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. దీంతో అది అతని ప్యాడ్లను తాకింది. ఆసీస్ టీం ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అంపైర్ కూడా వెంటనే దాన్ని అవుట్‌గా ప్రకటించాడు.

అయితే తాను అవుట్ కాలేదని నమ్మిన సిరాజ్ వెంటనే రివ్యూ కోరాడు. ఆ ఫలితం కూడా తమకు అనుగుణంగానే వస్తుందని ఆసీస్ భావించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మైదానం వీడటం మొదలు పెట్టింది. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా తమ డగౌట్ వైపు వెళ్లిపోయారు. ఖవాజా అయితే మైదానం వీడి డగౌట్‌కు కూడా వెళ్లిపోయాడు.
రిప్లేలో బంతి సిరాజ్ బ్యాటును తాకినట్లు తేలింది. దీంతో వాళ్లు సిగ్గుతో వేగంగా మళ్లీ మైదానంలోకి వచ్చేశారు. తమ తమ ఫీల్డింగ్ స్థానాల్లో నిలబడ్డారు. ఆ తర్వాతి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. షమీని అవుట్ చేసి భారత ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అయితే ఆసీస్ స్టార్లు మైదానం వీడటం, ఆ తర్వాత సిగ్గు పడుతూ తిరిగి మైదానంలోకి రావడం మాత్రం వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పంచుకుంటున్నారు. దేనికీ తొందర పడకూడదని నీతులు చెప్తున్నారు. మరికొందరేమో ఆసీస్ టీంను సిరాజ్ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఆసీస్ ప్లేయర్లపై మాత్రం తెగ జోకులు పేలుస్తున్నారు.