డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ కీపర్‌గా ఎవరిని ఆడించాలని మ్యాచ్ ముందు వరకు చర్చ జరిగింది. అయితే టాస్ సమయంలో రోహిత్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ కాదని, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌నే ఆడిస్తున్నామని వెల్లడించాడు. అతను కూడా తనపై ఉన్న అంచనాలను అందుకున్నట్లే కనిపించాడు.
తొలిరోజు ఆటలో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచులను అందుకున్న భరత్ కీపింగ్‌లో చక్కగా రాణించాడు. ముఖ్యంగా వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను అతను అందుకున్న విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుడి వైపు ఫుల్ ఆన్ డైవ్ చేసిన అతను.. దాదాపు రెండు చేతులతో బంతిని అందుకున్నాడు. అతని కీపింగ్ స్కిల్స్ అక్కడితో ఆగలేదు.

ఇదే విషయాన్ని కామెంటరీ బాక్సులో ఉన్న ఇంగ్లండ్ మాజీ దిగ్గజం నాసిర్ హుస్సేన్ ఎత్తిచూపాడు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ 27వ ఓవర్లో షమీ ఒక షార్ట్ బాల్ వేశాడు. దాన్ని పుల్ చేసేందుకు స్టీవ్ స్మిత్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ బంతిని కీపర్ భరత్ సులభంగా అందుకున్నాడు. ఈ సమయంలో టీమిండియా ఆటగాళ్లు అందరూ క్యాచ్ కోసం అప్పీల్ చేశారు.
విరాట్ కోహ్లీ కూడా చాలా ఉత్సాహంగా అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ స్పందించలేదు. రివ్యూ కోరాలా? అని రోహిత్ సంకోచించాడు. ఇలాంటి సమయంలో వేగంగా స్పందించిన కేఎస్ భరత్.. బంతి బ్యాటును తాకలేదని చెప్పాడు. ఇలా కోహ్లీని కాదనడానికి చాలా ధైర్యం కావలసి ఉంటుందని, ఐదో మ్యాచ్ ఆడుతున్న భరత్ అలా చేయడం చాలా గొప్ప విషయం అని నాసిర్ హుస్సేన్ అన్నాడు.
'కోహ్లీతో అతను చాలా టఫ్‌గా వ్యవహరించాడు. కోహ్లీని కాదనడం అంత ఈజీ కాదు. కానీ భరత్ అదే చేశాడు. ఆ క్యాచ్ విషయంలో రివ్యూ తీసుకోవాలని కోహ్లీ అనుకున్నాడు. అయితే త కెరీర్‌లో ఐదో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న భరత్ వెళ్లి.. కింగ్ కోహ్లీతో నువ్వు చెప్పింది తప్పు అనడం అంత సులభం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అది కూడా సరైన నిర్ణయం తీసుకున్నాడు' అని చెప్పాడు.
భారత జట్టులో ఎవరైనా కోహ్లీకి ఎదురు చెప్తారా? అని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ ల్యాంగర్ అడిగాడు. అప్పుడు కామెంటరీ బాక్సులో ఉన్న మాజీ కోచ్ రవిశాస్త్రి దీనికి సమాధానం ఇచ్చాడు. 'కోహ్లీ చాలా సరదాగా ఉండే సీనియర్. స్టీవ్ స్మిత్‌తో ఉండే కాంపిటీషన్‌తో అంత ఎగ్జయిట్ అయ్యాడు. మరో బ్యాటర్ అయితే దానిలో సగం ఎగ్జయిట్‌మెంట్ కూడా కనిపించదు. నన్నడిగితే పుజారా వెళ్లి విరాట్ ఉత్సాహాన్ని తగ్గించాల్సింది' అని వివరించాడు.