ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహనేకు అదృష్టం కలిసొచ్చింది. లేదంటే అతను కూడా పెవిలియన్ చేరాల్సి వచ్చేది. రెండో రోజు ఆటలో భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆట ముగిసే సమయానికి రహానే క్రీజులో ఉండటంతో ఫ్యాన్స్ కొంత ఊపిరి పీల్చుకున్నారు.
తొలి రోజు ఆటలో బంతితో విఫలమైన భారత జట్టు.. రెండో రోజు తేరుకుంది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు 469 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా భారీ స్కోరు చేసేలా కనిపించింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి విఫలమయ్యాడు.

ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ (13).. బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని వదిలేయడానికి ట్రై చేశాడు. కానీ అది నేరుగా వికెట్లను తాకడంతో తెల్లమొఖం వేశాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అనుకున్న ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపు రవీంద్ర జడేజా (48) ఆశలు పెంచాడు.
కానీ నాథన్ లియాన్ బౌలింగ్‌లో అతను కూడా పెవిలియన్ చేరాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజింక్య రహానే (29 నాటౌట్), కేఎస్ భరత్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ రెండో రోజు మ్యాచ్ మూడో సెషన్‌లో రహానే కూడా అవుటయ్యాడు. ప్యాట్ కమిన్స్ వేసిన బంతికి రహనే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంపై రహానే రివ్యూ కోరాడు.
ఆ సమయంలో కమిన్స్ నోబాల్ వేసినట్లు తేలింది. కమిన్స్ గీత దాటడంతో రహానే బతికిపోయాడు. రెండో రోజు ఆట ముగిసే వరకు క్రీజులో నిలబడ్డాడు. మూడో రోజు ఆట మొదలైన తర్వాత భారత్ ఏమాత్రం పోటీలో నిలవాలన్నా రహానే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తవడం ఖాయంగా కనిపిస్తోంది.