వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వాళ్లు చెలరేగడంతో భారత్ ముందు కంగారూలు భారీ స్కోరు నిలిపారు. ముఖ్యంగా నాలుగో రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత కాసేపటికే ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
భారత్ ముందు 444 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది. ఈ లక్ష్య ఛేదనలో భారత్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా ఇద్దరూ పరమ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు.

ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 164/3 స్కోరుతో నిలిచింది. ఇంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతుంటే ఒక అభిమాని అంత కన్నా థ్రిల్ అనుభవించాడు. భారత జట్టుకు సపోర్ట్ చేస్తున్న ఒక ఫ్యాన్.. తనతో వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు.
వేలాది మంది ఉన్న స్టేడియంలో అతను చేసిన ప్రపోజల్‌ను ఆమె అంగీకరించింది. దీంతో తనతో తీసుకొచ్చిన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడీ టీమిండియా ఫ్యాన్. ఇదంతా కూడా కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కొందరు మాత్రం ఇంత టెన్షన్‌లో ఉంటే ఇదేంటి భయ్యా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం, ఓడటం అనేది ఇక కోహ్లీ, రహానే చేతుల్లోనే ఉంది. వాళ్లు కనుక ఐదో రోజు రాణిస్తే భారత్ చరిత్ర సృష్టించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.