వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఈ ఓటమి అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మాజీలు మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పెట్టడం కరెక్ట్ కాదని రోహిత్ అన్నాడు. కనీసం మూడు మ్యాచులు పెట్టాలని, రెండింట్లో గెలిచిన వారిని విజేతలుగా ప్రకటించాలని చెప్పాడు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వార్నర్ కూడా ఇదే మాట అన్నాడు. అయితే ఈ వాదనతో మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ విభేదించాడు. రోహిత్ అభిప్రాయం కరెక్ట్ కాదన్నాడు. 'ఎంతో కాలం క్రితమే ఇది డిసైడ్ అయిపోయింది. డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలడానికి ముందే.. ఫైనల్ ఒక్కటే అని నిర్ణయించేశారు కదా. దానికి ప్రిపేర్ అవ్వాలి' అని గవాస్కర్ అన్నాడు.

ఈ సందర్భంగా ఐపీఎల్‌ను సన్నీ ఉదహరించాడు. ఐపీఎల్ ఫైనల్ కోసం జట్లన్నీ సిద్ధం అవ్వడం లేదా? అని ప్రశ్నించాడు. 'ఐపీఎల్‌లో ఫైనల్ కోసం అందరూ రెడీ అవుతున్నారు కదా. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదే?' అని లిటిల్ మాస్టర్ నిలదీశాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఫెయిలవుతారని, కొన్నిసార్లు ఈ ఫేజ్ కొంతకాలం కంటిన్యూ అవుతుందని చెప్పాడు.
'ఎవరికైనా ఒక రోజు కలిసి రాకపోవచ్చు. ఒక్కోసారి రెండు, మూడ్రోజులు సరిగా ఆడకపోవచ్చు. ఇప్పుడు అడిగారు కదా అని మూడు మ్యాచులతో విజేతను నిర్ణయిస్తే.. రేపు ఐదు మ్యాచులు అడగకుండా ఉంటారా?' అని గవాస్కర్ సూటిగా ప్రశ్నించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్ కూడా ఇదే మాట అన్నాడు.
బెస్ట్ ఆఫ్ త్రీ అనేది సరైన వాదన కాదని అభిప్రాయపడిన కమిన్స్.. ఒలింపిక్స్‌లో కూడా ఒకటే ఫైనల్ ఉంటుందని గుర్తుచేశాడు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యపు షాట్లతోనే టీమిండియా ఓడిందనేది కాదనలేని సత్యం. ఇకనైనా టీమిండియా స్టార్లు తమ తప్పులు సరిదిద్దుకుంటారేమో చూడాలి.