ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుటైన విధానంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో స్కాట్ బోలాండ్ వేసిన బంతిని గిల్ సరిగా అంచనా వేయలేకపోయాడు. డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్‌కు కొంచెం దూరంగా దూసుకుపోయింది.
ఇది చూసిన గ్రీన్ తన ఎడం చేతి వైపు డైవ్ చేసి బంతి అందుకున్నాడు. అయితే మునివేళ్లతో ఆ బంతిని పట్టుకొనేందుకు అతను ప్రయత్నించగా బంతి నేలను తాకినట్లు కనిపించింది. ఈ క్యాచ్ క్లియర్‌గా ఉందా? లేదా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోరో ఈ క్యాచ్ క్లియర్‌గానే ఉందని భావించి, గిల్‌ను అవుట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయం నచ్చని గిల్.. దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు. గ్రీన్ అందుకున్న క్యాచ్‌కు సంబంధించిన ఒక ఫొటోను నెట్టింట పంచుకున్నాడు. ఇలా చేయడం ద్వారా ఐసీసీ నిబంధనల్లో 2.7 ఆర్టికల్‌ను గిల్ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిన విషయంపై పబ్లిక్‌గా విమర్శించడం, అవమానించడం వంటి చర్యలు ఈ సెక్షన్‌లోకి వస్తాయని ఐసీసీ తెలిపింది.
దీన్ని గిల్ ఉల్లంఘించినట్లు భావించిన ఐసీసీ.. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ విధించినట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్ రెండు జట్లు చాలా స్లోఓవర్ రేట్ మెయింటైన్ చేశాయి. నాలుగో రోజు చివరకు సుమారు 45 ఓవర్లు వృధా అయ్యాయి. దీంతో ఈ రెండు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ ఇద్దరికి కూడా ఫైన్ వేసినట్లు ఐసీసీ తెలిపింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.