దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న భారత జట్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఓడింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో ఆసీస్ ఫేవరెట్ అని చాలా మంది అన్నారు. అయినా సరే భారత్‌ను మాత్రం పూర్తిగా తీసిపారేయలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం టీమిండియా చేసిన అతి పెద్ద తప్పు. దానికితోడు తొలి రోజు ఆటలో బౌలర్లు దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. చివరకు టీమిండియా ఏకంగా 444 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా భారత బ్యాటర్లు సరిగా ఆడలేదు. అందుకే చాలా మంది మాజీలు మండిపడుతున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయామనే బాధ కన్నా.. ఓడిపోయిన విధానం, కారణం చికాకు కలిగిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఛేజ్ చేసేందుకు బరిలో దిగిన భారత్.. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ మంచి టచ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశలు చావలేదు. అయితే తనపై ఆశలు పెట్టుకోవడం తప్పని రోహిత్ మళ్లీ నిరూపించాడు.
లియాన్ బౌలింగ్‌లో పరమ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. అతని షాట్ సెలెక్షన్ చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. ఇక కౌంటీల్లో చెలరేగిన పుజారా కూడా అత్యంత దారుణంగా ఫెయిలయ్యాడు. తన జీవితంలో ఎప్పుడూ ఆడని అప్పర్ కట్‌కు ట్రై చేశాడు. ఈ క్రమంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
నాలుగో రోజు ఆటలో పట్టుదలగా ఆడిన విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. ఐదో రోజు ఆట మొదలైన కాసేపటికే అవుటయ్యాడు. ఎప్పట్లాగే ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా పడిన బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఇక అంతే భారత పతనం మొదలైంది. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఇద్దరూ కూడా అలాగే ఏదో చేయబోయి అవుటయ్యారు. చివరకు రహానే కూడా అవుటయ్యాడు.
వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కాసేపు ఆడినట్లే కనిపించాడు. కానీ అవతలి ఎండ్‌లో వికెట్లు పడటంతో డిఫెన్స్ ఆడబోయాడు. ఈ క్రమంలో చివరకు అతను కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పోరాటం ముగిసింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా భారత వెటరన్లపై మండిపడుతున్నారు. చాలా దారుణమైన షాట్ సెలెక్షన్ వల్లనే భారత్ ఓడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి మ్యాచ్‌లో ఎలా ఆడాలో కూడా టీమిండియా సీనియర్లకు తెలియడం లేదని, పరమ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇలాగైతే భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవదని అంటున్నారు. సీనియర్లే ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఎలా? అంటున్నారు.