వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు దక్కింది. అయితే మరో ముగ్గురు కుర్రాళ్లకు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారు. వాళ్లెవరంటే?
సంజూ శాంసన్: ఎంతో ట్యాలెంట్ ఉన్న సంజూకు నిలకడగా టీమిండియా అవకాశాలు రావడం లేదు. సెలెక్టర్లు సంజూనే పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. అసలు ఏం చేస్తే అతన్ని జట్టులోకి తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అతన్ని పక్కన పెట్టిన బీసీసీఐ.. ఇషాన్ కిషన్, జితేశ్ శర్మను జట్టులోకి తీసుకుంది.

ఈ ఫార్మాట్‌లో ఇషాన్ కిషపర్ పరమ చెత్తగా ఆడుతున్నాడు. అయినా సరే అతన్నే సెలెక్టర్లు ఎంపిక చేయడం గమనార్హం. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచుల్లో సంజూ కేవలం 138 పరుగులే చేశాడు. దీని వల్లనే అతన్ని పక్కన పెట్టేసి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. అయితే ఈ టోర్నీలో రాణించిన వారికేం అవకాశాలు ఇవ్వలేదు కూడా.
అభిషేక్ శర్మ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అదరగొట్టిన ప్లేయర్ అభిషేక్ శర్మ. అతను పది మ్యాచుల్లో 485 పరుగులతో రాణించాడు. అది కూడా 192.46 స్ట్రైక్ రేటు, 48.5 సగటుతో అదరగొట్టాడు. మూడు హాఫ్ సెంచరీలు, రెండు శతకాలు సాధించాడు. కానీ అతనికి కూడా ఆసీస్‌తో సిరీసులో అవకాశం దక్కలేదు.
తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ వంటి ఎడం చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో.. అభిషేక్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టేసి ఉండొచ్చు. కానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతనికి అవకాశం ఇవ్వకపోవడం మాత్రం నిజంగా దురదృష్టమే అని చెప్పాలి.
రియాన్ పరాగ్: తన యాటిట్యూడ్‌తో హేటర్స్‌ను సంపాదించుకున్న రియాన్ పరాగ్.. ఇటీవల తన ఆటతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన అతను.. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అన్ని విభాగాల్లో రాణించి ఔరా అనిపించాడు. పది మ్యాచుల్లో 182.79 స్ట్రైక్ రేటు, 85 సగటుతో 510 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో ఏకంగా 40 బౌండరీలు బాదాడీ కుర్రాడు. అంతేకాదు బంతితో కూడా కీలకమైన భాగస్వామ్యాలను బ్రేక్ చేశాడు. 11 వికెట్లతో రాణించాడు. ఎమర్జింగ్ ప్లేయర్స్ ఏసియా కప్‌లో భారత్ తరఫున ఆడిన వారిలో పరాగ్ కూడా ఒకడు. ప్రస్తుతం దేశవాళీల్లో పరాగ్ కన్నా బెటర్ ప్లేయర్ లేడనే చెప్పాలి. కానీ అతనికి కూడా ఆసీస్‌తో టీ20ల్లో చోటు దక్కకపోవడం బాధాకరం.