వరల్డ్ కప్ ముందు వరుసగా ఐదు వన్డేలు ఓడిపోవడం అంటే మాటలు కాదు. ఆ టీం కాన్ఫిడెన్స్ దారుణంగా దెబ్బతిని ఉంటుంది. మెగా టోర్నీకి ముందు ఒక్క విజయం కోసం తహతహలాడుతూ ఉంటుంది. అదే ఆటను కనబరిచింది ఆస్ట్రేలియా. అన్ని విభాగాల్లో భారత్ కన్నా మెరుగ్గా రాణించి మూడు వన్డేల సిరీసులో చివరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.
ఇంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీసులో కూడా ఆసీస్ ఆకట్టుకోలేదు. కీలకమైన ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉండటంతో ఆ సిరీసులో చివరి మూడు మ్యాచులూ ఓడిపోయింది. ఇక భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత కూడా ఆ టీం ప్లేయర్లు అందరూ పూర్తి ఫిట్‌గా కనిపించలేదు. దీంతో భారత్‌తో మూడు వన్డేల సిరీసుల తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.

ఇలా వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయిన చెత్త రికార్డుతో రాజ్‌కోట్‌లో అడుగు పెట్టిన ఈ టీం.. రోహిత్, విరాట్ తదితరులు చేరిన భారత్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే పట్టువదలని కంగారూలు అన్ని విభాగాల్లో చెలరేగారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో ఆకట్టుకున్నారు. దీంతో భారత్‌ను సరిగ్గా వరల్డ్ కప్‌కు ముందు 66 పరుగుల తేడాతో చిత్తు చేశారు.
ఈ విజయంపై మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. 'స్టార్క్, మ్యాక్స్‌వెల్ మొదటి మ్యాచ్‌లో హిట్ అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత వాళ్లు జట్టులోకి వచ్చారు. మ్యాక్సీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ మంచి రిథమ్‌లో కనిపించాడు. దీంతో నేను చాలా హ్యాపీ. వరల్డ్ కప్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండడు. కాబట్టి మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది' అని తెలిపాడు.
'ఈ మ్యాచులో మార్ష్, వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అద్భుతం. వాళ్లను చూస్తే చాలా డేంజరస్ కాంబోలా కనిపించారు. గాయాల విషయానికొస్తే హెడ్, ఆష్టన అగర్ ఇద్దరికీ గాయాలవడం చాలా పెద్ద సమస్య. అగర్ కాఫ్ గాయంతో ఇంటికెళ్లాడు. ఎవరిని ఆడించాలనే విషయంపై కూర్చొని ఆలోచించుకుంటాం' అని చెప్పుకొచ్చాడు.