క్రికెట్‌లో బలమైన టీమ్స్ ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఆ టీం కూడా ఈసారి జరుగుతున్న వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటే. అయితే మెగాటోర్నీకి ముందు భారత్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం ఈ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై భారత జట్టు తీవ్రమైన ఒత్తిడి పెట్టాలని, ఆ టీంను వణికించాలని మాజీ పేసర్ శ్రీశాంత్ అంటున్నాడు.
ఈ సిరీసును పూర్తిగా డామినేట్ చేసి ఆస్ట్రేలియాపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకురావాలని శ్రీశాంత్ సలహా ఇచ్చాడు. అలాగే టీమిండియా నిలకడగా రాణిస్తూ వరల్డ్ కప్ కోసం గట్టిగా రెడీ అవ్వాలని చెప్పాడు. 'కేఎల్ రాహుల్ వంటి వాళ్లు అన్ని మ్యాచులు ఆడి నిలకడగా రాణించాలని నేను చెప్తా. వరల్డ్ కప్‌లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని ఆస్ట్రేలియాకు చూపించండి' అని శ్రీశాంత్ చెప్పాడు.

'ఆస్ట్రేలియా టీం నమ్మకం కోల్పోయేలా చేయాలి. ఓడిపోవడం అనే మాటే ఉండకూడదు' అని సలహా ఇచ్చాడీ కేరళ స్పీడ్‌స్టర్. ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లకు భారత జట్టు విశ్రాంతినిచ్చింది. అయితే మూడో వన్డేలో వీళ్లంతా ఆడతారని తెలిపింది.
జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లను టీం మేనేజ్‌మెంట్ తెలివిగా ఉపయోగించుకోవాలని శ్రీశాంత్ అన్నాడు. దాదాపు 11 నెలల తర్వాత క్రికెట్ ఆడిన బుమ్రా.. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో బుమ్రా ఏ మ్యాచులు ఆడాలో తనే నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలని శ్రీశాంత్ అన్నాడు. ఎందుకంటే వరల్డ్ కప్‌లో అతను టీంకు చాలా ముఖ్యం అని చెప్పాడు.
'ఈ సిరీసులో ఎలాంటి పిచ్‌లు తయారు చేస్తారనేది ముఖ్యం. బుమ్రాకు ఏమాత్రం చిన్న గాయం ఉన్నా అతనికి విశ్రాంతి ఇవ్వాలి. తన శరీరం ఎలా ఉందనే నిర్ణయం బుమ్రానే తీసుకుంటే మంచిది. పేసర్ల పాత్ర వరల్డ్ కప్‌లో కూడా చాలా ముఖ్యం. వాళ్లను రొటేట్ చేస్తూ ఉండటం బెటర్. వాళ్లు కూడా మంచి పార్టనర్‌షిప్‌తో బౌలింగ్ చేయడంపై ఫోకస్ పెట్టాలి' అని సూచించాడు.