వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ఇంకా భారత అభిమానుల గుండెల్లో పచ్చిగానే ఉంది. అప్పుడే ఆసీస్‌తో టీ20 సిరీస్ వచ్చేసింది. విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతుంది.
ఇక్కడి పిచ్ చాలా బ్యాలెన్స్‌గా ఉంటుందని పేరు. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు పిచ్ నుంచి ఎంతో కొంత సహకారం లభిస్తూనే ఉంటుంది. రోహిత్, పాండ్యా ఇద్దరూ లేకపోవడంతో ఈ సిరీసులో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. వెటరన్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేశాడు. వరల్డ్ కప్‌లో జట్టును రోహిత్ ముందుండి నడిపించిన తీరు అమోఘమని కొనియాడాడు. ఈ మెగాటోర్నీలో జట్టుకు విధ్వంసకర ఓపెనింగ్స్ అందించడానికి రోహిత్ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
ఈ హై రిస్క్ ఆట ఆడినా కూడా టోర్నీలో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడీ స్టార్ క్రికెటర్. మొత్తం 11 మ్యాచుల్లో 125.95 స్ట్రైక్ రేటు, 54.27 సగటుతో 597 పరుగులు చేశాడు. ఇలా రోహిత్ తమను ముందుండి నడిపించాడని, ఈ టీ20 సిరీసులో తాము కూడా అలాగే ఆడే ప్రయత్నం చేస్తామని సూర్య చెప్పాడు.
'వరల్డ్ కప్‌లో రోహిత్ చేసిన ఆ పని మాకు ఎగ్జాంపుల్ సెట్ చేసింది. మనం ఇంత వరకు చూసిన రోహిత్ శర్మ కాదతను. చాలా కొత్తగా కనిపించాడు. టీం మీటింగ్స్‌లో ఎలా ధైర్యంగా ఆడాలని చెప్పాడో.. అదే మాకు చేసి చూపించాడు. తన కెప్టెన్సీలో ఆడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి ఆటతీరే ఈ సిరీసులో కూడా ఆడాలని అనుకుంటున్నాం' అని సూర్య తెలిపాడు.