World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోవడం చూసిన వంద కోట్ల మంది మనసులు ముక్కలయ్యాయి. మనకే అలా ఉంటే బరిలో దిగి ఎలాగైనా కప్పు కొట్టాలని అనుకున్న ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా తర్వాతి వరల్డ్ కప్ ఆడతారో లేదో తెలియని సీనియర్ ప్లేయర్ల పరిస్థితి ఏంటి? అదే విషయాన్ని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచులు గెలిచిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఫైనల్‌లో బ్యాటింగ్ తడబడటంతో కేవలం 240 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 43 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. దీంతో భారత జట్టు ఓటమిపాలైంది. అభిమానుల మనసులు ముక్కలయ్యాయి. ఆ టైంలో భారత క్రికెటర్ల మొహాలు చూస్తే వాళ్లు ఎంత బాధ పడ్డారో స్పష్టంగా కనిపించింది.

దీని గురించి తాజాగా మాట్లాడిన అశ్విన్.. 'మేం చాలా బాధపడ్డాం. రోహిత్, విరాట్ ఇద్దరూ ఏడ్చేశారు. వాళ్లను అలా చూసి నాక్కూడా చాలా బాధేసింది. అలా జరగకుండా ఉండాల్సింది. ఈ టీం అద్భుతంగా ఆడింది. అందరికీ తాము ఏం చేయాలో తెలుసు. అందరూ తమ పాత్ర తెలుసుకొని, దానికి తగ్గట్లు సిద్ధం అయ్యారు. జట్టులోని కోహ్లీ, రోహిత్ ఇద్దరూ నాచురల్ లీడర్లు. వాళ్లిద్దరూ జట్టులో ఒక మంచి వైబ్ ఉండేలా చూసుకున్నారు' అని చెప్పాడు.
'భారత క్రికెట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. అందరూ కూడా బెస్ట్ కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకడని చెప్తారు. రోహిత్ కూడా అద్భుతమైన సారధే. జట్టులోని ప్రతి ఒక్కరి గురించి తను తెలుసుకుంటాడు. మాకు ఏం ఇష్టమో, ఏది నచ్చదో రోహిత్‌కు తెలుసు. అందర్నీ అర్థం చేసుకుంటాడు. వ్యక్తిగతంగా అందర్నీ తెలుసుకునేందుకు కష్టపడతాడు' అని మెచ్చుకున్నాడు.
'రోహిత్ చాలా కష్టపడతాడు. నిద్ర కూడా మర్చిపోయి మీటింగ్స్‌లో పాల్గొంటాడు. జట్టులో వేసే వ్యూహాలు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి కృషి చేస్తాడు. ఇది భారత క్రికెట్‌లో అడ్వాన్స్‌డ్ స్థాయి కెప్టెన్సీ అనే చెప్పాలి' అని అశ్విన్ తెలిపాడు.