ప్రస్తుతం భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తెగ మెచ్చుకుంటున్న ప్లేయర్ మహమ్మద్ సిరాజ్. ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను సిరాజ్ ఒంటి చేత్తో తుత్తునియలు చేశాడు. అతని బౌలింగ్‌ను ఎలా ఆడాలో కూడా లంక బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే అతను ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో లంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా చాలా ఈజీగా ఛేజ్ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే బౌలర్ల ర్యాంకుల్లో కూడా సిరాజ్ (Mohammed Siraj) స్థానం మెరుగైంది. మళ్లీ వన్డేల్లో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అయితే కెరీర్ ఆరంభంలో సిరాజ్‌కు ఈ ఫార్మాట్ పెద్దగా అచ్చిరాలేదనే సంగతి చాలా మందికి గుర్తుండకపోవచ్చు. తను ఆడిన తొలి వన్డే మ్యాచులో సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.

ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచులో అతన్ని ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒకాట ఆడుకున్నారు. 2019లో ఇది జరిగింది. అదే ఏడాది ఐపీఎల్‌లో కూడా సిరాజ్ (Mohammed Siraj) తేలిపోయాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. సిరాజ్ తండ్రి ఆటోడ్రైవర్ అనే విషయం గుర్తుచేస్తూ.. 'నీకు క్రికెట్ ఎందుకు? వెళ్లి ఆటో వేసుకో' అంటూ అవమానించారు.
ఇక ఆ తర్వాత కరోనా రావడంతో దేశంలో లాక్‌డౌన్ పెట్టేశారు. ఆ సమయంలో తన కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచించినట్లు సిరాజ్ (Mohammed Siraj) చెప్పాడు. 'ఒక్క సంవత్సరం క్రికెట్‌లో ఏం చేయగలనో అది చేస్తా. ఒకవేళ ఏమీ సాధించలేకపోతే.. క్రికెట్ వదిలేసి వేరే ఏదైనా పనిచేసుకోవాలని డిసైడ్ అయ్యా' అని సిరాజ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఇక లాక్‌డౌన్ తర్వాత అద్భుతంగా మెరుగైన సిరాజ్.. వన్డేల్లో టాప్ బౌలర్‌గా ఎదిగాడు. షమీ వంటి సీనియర్ బౌలర్ కన్నా కూడా ముందు సిరాజ్‌నే జట్టులోకి తీసుకుంటున్నారంటేనే అతను టీమిండియాకు ఎంత కీలకమైన బౌలర్‌గా మారాడో అర్థం చేసుకోవచ్చు.