గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఆసియా కప్‌లో రీఎంట్రీ ఇచ్చిన మ్యాచులోనే సెంచరీ బాదిన అతను.. ఆ తర్వాత కూడా కీలకమైన ఇన్నింగ్సులు ఆడుతూ వచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ క్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్.. టీమిండియా మ్యాచ్ టికెట్ల కోసం ఎవరైనా ఫోన్లు, మెసేజిలు చేస్తే వారికి రిప్లై ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ కామెంట్స్ చేశాడు. 'మ్యాచ్ టికెట్ల కోసం నాకు ఎవరు మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవ్వను' అని తేల్చిచెప్పేశాడు.

'నేను దురుసుగా ఉండాలని ఈ మాటలు అనడం లేదు. జస్ట్.. ఆ గొడవ నుంచి దూరంగా ఉండి ఆటపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నా. నేను ఈ మెసేజ్‌ను నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇస్తున్నా. టికెట్ల కోసం నాకు మెసేజ్ చేయాలని అనుకుంటే.. దయచేసి ఆ ఆలోచన మానుకోండి' అని రాహుల్ కోరాడు.
అదే సమయంలో వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఎదుర్కోవడం తమకు ఎంతో ఉపయోగపడుతుందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. 'వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఆ టీంలో కొందరు అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్‌లో వారితో కలిసి ఆడాం. మ్యాచ్‌పై వాళ్ల ప్రభావం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు' అని చెప్పాడు.
'ఆసీస్ ప్లేయర్లు ఇండియాకు చాలా ఎక్కువగా వస్తారు. ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులు వాళ్లకు కూడా బాగా తెలుసు. తమ నైపుణ్యాలను మా టీమ్స్ ఎలా ఉపయోగించుకుంటాయి? అనేదే ఈ సిరీసులో కీలకం. వరల్డ్ కప్ ముందు ఇంత కన్నా బెస్ట్ ఛాలెంజ్ మాకు ఉంటుందని నేను అనుకోవడం లేదు' అని చెప్పుకొచ్చాడీ స్టార్ బ్యాటర్.
తన ఫిట్‌నెస్ గురించి కూడా మాట్లాడిన కేఎల్.. 'ఆసియా కప్‌లో నేను ఆడటం అంతా చూశారు. సూపర్-4లో అన్ని మ్యాచులు ఆడా. 50 ఓవర్లు కీపింగ్ చేసి, ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా పరుగులు చేశా. దీంతో నా ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్న వారికి సమాధానం దొరికిందనే అనుకుంటున్నా. వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాగే కొనసాగుతానని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.