ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీసు కోసం భారత జట్టు రెడీ అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లకు ఈ సిరీసులో విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో గిల్‌తో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారనే చర్చ జరుగుతోంది. యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఈ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు.
లెక్కలు చూస్తే..
ఓపెనర్‌గా రికార్డులు చూస్తే మాత్రం ఎవరైనా సరే ఇషాన్ కిషన్‌కు ఓటేస్తారు. రుతురాజ్ ఓపెనింగ్ చేస్తే కిషన్ మిడిలార్డర్‌లో ఆడాల్సి వస్తుంది. ఆసియా కప్‌లో కిషన్ ఫర్వాలేదనిపించినా కూడా.. ఓపెనర్‌గా కిషన్ రికార్డు అద్భుతంగా ఉంది. ఓపెనర్‌గా 75 సగటుతో పరుగులు చేసే అతను.. మిడిలార్డర్‌లో కేవలం 32 సగటుతోనే పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కూడా బాదిన కిషన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అదే సమయంలో టీ20ల్లో టీమిండియా ఓపెనర్‌గా 11 మ్యాచులు ఆడిన గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దేశవాళీలు, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా మంచి రికార్డు ఉండటంతో అతన్ని ఈ టీంలోకి తీసుకున్నారు. కాబట్టి కేవలం రికార్డులు మాత్రమే చూస్తే కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిషన్‌తో డేంజర్..
ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపడం టీమిండియాకు పెద్ద చిక్కు ప్రశ్న. ఎందుకంటే వరల్డ్ కప్ టీంలో కూడా ఉన్న కిషన్ మెగా టోర్నీలో కచ్చితంగా మిడిలార్డర్‌లో ఆడాల్సిందే. ఆసియా కప్‌లో ఫర్వాలేదనిపించినా కూడా.. మిడిల్‌లో కిషన్ తనను తాను ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి సమయంలో మళ్లీ అతన్ని ఓపెనర్‌గా పంపడం వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మిడిలార్డర్‌లో ఆడటం కిషన్‌కు అలవాటు తప్పే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే వరల్డ్ కప్‌లో టీమిండియాకు కిషన్ పెద్ద తలనొప్పిగా మారడం ఖాయం. కాబట్టి తన మిడిలార్డర్ ఆటను మెరుగు పరుచుకోవడానికి కిషన్‌కు ఆసీస్ సిరీస్ పెద్ద అవకాశం అని చెప్పొచ్చు.

లెక్క తేలాలంటే..
అయితే కిషన్ మిడిలార్డర్‌లో ఆడటం వల్ల టీమిండియాకు మరో తలనొప్పి వస్తుంది. రీఎంట్రీలో రాణిస్తున్న కేఎల్ రాహుల్ తన నాలుగో నెంబర్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐదో నెంబర్‌లో శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్.. ముగ్గురిలో ఒకరిని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఇది చేయాలంటే ఈ ముగ్గుర్నీ ఆసీస్‌తో సిరీసులో ఆడించాలి. వీరిని ఆడించాలంటే కిషన్‌ను మిడిల్‌లో ఆడించడం కుదరదు. అతనితో ఓపెనింగ్ చేయించాల్సిందే. అప్పుడే మిగతా ముగ్గురూ మిడిల్‌లో ఆడి తమ సత్తా చాటుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే వరల్డ్ కప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న కిషన్‌కు తన ఆటను మెరుగు పరుచుకునే అవకాశం కూడా దక్కుతుంది.
గైక్వాడ్‌కు కీలకం..
ప్రస్తుతం అందరి చూపు వరల్డ్ కప్ మీదనే ఉంది. అయితే ఆసియా క్రీడల్లో కూడా టీమిండియా పాల్గొంటుందని మర్చిపోకూడదు. ఈ పోటీల్లో కచ్చితంగా మెడల్ గెలవాలనేది టీమిండియా కల. ఈ టీం కెప్టెన్ అయిన రుతురాజ్‌కు ఆసీస్ సిరీసులో మంచి అనుభవం వస్తుంది. ప్రమాదకరమైన ఆసీస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా రుతురాజ్ బ్యాటింగ్ చాలా మెరుగవుతుంది.
అంతేకాదు, భారత క్రికెట్‌లో ఫ్యూచర్ స్టార్స్‌లో రుతురాజ్ ఒకడు. రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ల తర్వాత భారత జట్టును ముందుండి నడిపించే సత్తా ఉన్న వాడు. అలాగే కిషన్‌ను కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గానే పరిగణిస్తే.. రోహిత్, గిల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆసీస్‌పై ఓపెనింగ్ చేయడం అతని కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది.