ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత టాపార్డర్ తడబడింది. గువాహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్.. ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
కానీ అతని ఆలోచన పారలేదు. ఎందుకంటే తొలి రెండు మ్యాచుల్లో భారత్‌కు అద్భుతమైన ఆరంభాలు అందించిన యశస్వి జైస్వాల్ (6) ఈ మ్యాచులో ఫెయిలయ్యాడు. బెహ్రాండాఫ్ వేసిన బంతిని ఆడే క్రమంలో కీపర్ మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

లెంగ్త్ డెలివరీని ముందుకొచ్చి బాదేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. కానీ ఈ క్రమంలో షేప్ కోల్పోయిన అతను తడబడ్డాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లగా.. అద్భుతంగా రియాక్ట్ అయిన వేడ్ సూపర్ క్యాచ్‌తో జైస్వాల్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 14 పరుగులకే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదిన కిషన్.. ఈ మ్యాచులో కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. జేసన్ రిచర్డ్‌సన్ వేసిన బంతిని కవర్స్ దిశగా బాదేందుకు కిషన్ ప్రయత్నించాడు.
అయితే ఎక్స్‌ట్రా బౌన్స్ వల్ల కిషన్ షాట్ సరిగా కనెక్ట్ అవ్వలేదు. దీంతో అది నేరుగా కవర్స్‌లో ఉన్న స్టొయినిస్ వద్దకు వెళ్లింది. దాన్ని అతను చటుక్కున పట్టేయడంతో కిషన్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (39) కాసేపు ఇన్నింగ్స్ నిలబెట్టాడు.
మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన అతను.. హార్డీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 81 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.