Glenn Maxwell: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన విజయం అందించాడు. ఓడిపోయే స్థితి నుంచి ఆసీస్‌ను అతను గెలిపించిన తీరు చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. భారీ స్కోరు చూసిన భారత అభిమానులు.. ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలుస్తుందని అనుకున్నారు.
కానీ ఆసీస్ అదిరే ఆటతీరుతో మ్యాచ్‌ను భారత్ చేతుల్లో నుంచి లాగేసుకుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేసింది. జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) ఇద్దరూ ఫెయిలయ్యారు.

అయితే రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) ఇద్దరూ మంచి సహకారం అందించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
ఈ భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఈ సిరీసులో తొలి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ (35) ధనాధన్ షాట్లతో భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. అతనికి ఆరోన్ హార్డీ (16) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి 4 ఓవర్లలోనే 47 పరుగులతో ఆసీస్‌కు అదిరే ఆరంభం అందించారు.
అయితే వీళ్లిద్దరితోపాటు ఇంగ్లిస్ (10) కూడా అవుటవడంతో భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరకు స్టొయినిస్ (17), టిమ్ డేవిడ్ (0) కూడా ఫెయిలయ్యారు. ఇలా ఒక పక్క వికెట్లు పడుతూనే ఉన్నా కూడా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్) చెలరేగాడు.
మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్సులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతనికి మాథ్యూ వేడ్ (28 నాటౌట్) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ పట్టుదలగా ఆడటంతో చివరి బంతికి ఆసీస్‌కు థ్రిల్లింగ్ విజయం దక్కింది.
భారత బౌలర్లలో రవి బిష్ణోయి రెండు వికెట్లతో రాణించగా.. అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి, ఈ సిరీసులో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన నాలుగు ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇవ్వడం గమనార్హం.