వరల్డ్ కప్ ముందు టీమిండియాకు పెద్ద సమస్యగా మారిన అంశం సూర్యకుమార్ యాదవ్. వన్డే ఫార్మాట్ కోడ్ క్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడిన సూర్య.. ఎట్టేకలకు వన్డేల్లో కూడా మంచి టచ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సూర్య ఆకట్టుకున్నాడు. జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు లేవనెత్తిన వారందరికీ ఈ ఇన్నింగ్స్‌తో సూర్య బదులిచ్చాడు.
అనవసరమైన షాట్లు ఆడేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా.. తన సహజమైన దూకుడును పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అందరూ సూర్య ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సూర్యకు సరైన స్థానం మిడిలార్డర్ కాదని మాజీ దిగ్గజం గౌతం గంభీర్ అన్నాడు. అతన్ని చివర్లో పంపితే బాగుంటుందని చెప్పాడు.

ఆసీస్‌తో తొలి మ్యాచులో సూర్య ఆటతీరు చూస్తే అతను ఎంత కష్టపడ్డాడో అందరికీ అర్ధమైంది. ఈ క్రమంలోనే టీమిండియాకు గంభీర్ కీలకమైన సలహా ఇచ్చాడు. వరల్డ్ కప్‌లో సూర్యను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని సూచించాడు. ఇది సాధ్యం అవ్వాలంటే.. మిడిల్‌లో రవీంద్ర జడేజాను ఆడించాలని చెప్పాడు. ఈ నిర్ణయం చాలా పెద్ద గ్యాంబిల్ అని, అయితే ఇది కనుక సక్సెస్ అయితే టీమిండియా మరింత బలంగా మారుతుందని తెలిపాడు.
వరల్డ్ కప్ టీంలో సూర్యకు చోటు కచ్చితంగా ఉండాలని, అందుకే కొంత రిస్క్ తీసుకోక తప్పదని గంభీర్ అన్నాడు. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లు టీంలో మార్పులు చేయడం కూడా కుదరదని అన్నాడు. 'వరల్డ్ కప్‌లో ఆడే సమయంలో జట్టు చాలా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఈ టోర్నీలో టీంలో మార్పులు, చేర్పులు చేయడం కష్టం. 2011లో చూసుకున్నా యూసఫ్ ఫటాన్ ఒక 5-6 మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత ఆ స్థానాన్ని సురేష్ రైనా దక్కించుకున్నాడు' అని గంభీర్ గుర్తుచేశాడు.
ఈసారి సూర్యకుమార్ యాదవ్ కనుక మీ ఫిక్స్‌డ్ టీంలో ఉంటే.. అతన్ని 6-7 స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపాలని చెప్తా. అయితే అప్పుడు ఐదో నెంబర్‌లో ఎవరు ఆడతారనేది సమస్య. అదే జరిగితే జడేజాను ఐదో నెంబర్‌లో, హార్దిక్ పాండ్యాను ఆరో స్థానంలో పంపొచ్చు. దీని వల్ల చివరి 15-20 ఓవర్లలో సూర్యకుమార్ ఫినిషర్‌గా వస్తాడు. జడేజాను మిడిల్‌లో అలాగే.. సూర్య ఉన్న ఫామ్ చూసిన తర్వాత ఏడో నెంబర్‌లో ఆడించడం పెద్ద గ్యాంబిల్. దీని వల్ల టాప్ ఫోర్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి పడుతుంది' అని గంభీర్ వివరించాడు.