వన్డే వరల్డ్ కప్ పూర్తయి వారం గడుస్తోంది. కానీ ఇంకా భారత అభిమానుల మనసుల్లో ఇంకా ఆ బాధ పోలేదు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ తాజాగా తన వరల్డ్ కప్ టీంను ఎంపిక చేశాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ తదితర జట్లన్నీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో పాకిస్తాన్, ఇంగ్లండ్ వంటి జట్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో గంభీర్ తన బెస్ట్ పదకొండు మంది ప్లేయర్లుగా ఎవరిని ఎంచుకుంటాడని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే తన బెస్ట్ టీంలో పాకిస్తానీలకు గంభీర్ చోటివ్వలేదు. ట్రోఫీ గెలిచిన ఆసీస్ నుంచి కూడా ఒక్కరికే ఛాన్స్ ఇచ్చాడు.

మొత్తంగా నలుగురు భారతీయులు, ముగ్గురు సౌతాఫ్రికా ప్లేయర్లు, ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను గంభీర్ ఎంచుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ నుంచి చెరొకరిని తీసుకున్నాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ నిజంగా గంభీర్ సెలెక్ట్ చేసిన జట్టు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు.
తమ జట్లకు అదిరే ఆరంభాలు అందించిన క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మను తన టీంలో కూడా ఓపెనర్లుగా గంభీర్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీ, డారియల్ మిచెల్, హెన్రిక్ క్లాసెన్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా నలుగురు ఆల్‌రౌండర్లను ఎంపిక చేశాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్‌ను తన టీంలో గంభీర్ ఎంచుకున్నాడు. ఇక పేసర్ల విషయంలో పూర్తిగా భారతీయులనే తీసుకున్న గంభీర్.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీని సెలెక్ట్ చేశాడు.
గంభీర్ టీం: క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, డారియల్ మిచెల్, హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ