ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్) కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో టీం పగ్గాలను రాహుల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ ముందు వరకు వన్డే ఫార్మాట్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ మ్యాచులో జట్టుకు అవసరమైన పద్ధతిలో ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే టీమిండియా రెగ్యులర్ టీంలో సెకండ్ ఆప్షన్ పేసర్‌గా ఉన్న మహమ్మద్ షమీ కూడా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

టీమిండియాకు కేఎల్ రాహుల్ లక్కీ చార్మ్ అని, అతని కెప్టెన్సీలో చాలా అద్భుతాలు జరిగాయని లెక్కలు చెప్తున్నారు ఫ్యాన్స్. మూడేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక విమర్శలపాలైన విరాట్ కోహ్లీ శతకం చేసింది రాహుల్ కెప్టెన్సీలోనే. ఈ గ్యాప్ తర్వాత కోహ్లీ చేసిన మొదటి వన్డే సెంచరీ కూడా రాహుల్ సారధ్యంలోనే కావడం గమనార్హం. అంతేకాదు, శుభ్‌మన్ గిల్ తొలి టెస్టు శతకం వచ్చిందీ రాహుల్ కెప్టెన్సీలోనే.
గిల్ తొలి వన్డే శతకం, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రీఎంట్రీ.. ఇలా ఈ జాబితాలోని చాలా అంశాలు రాహుల్ కెప్టెన్సీలోనే జరిగాయి. అంతేకాదు, అతని కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 8 విజయాలు నమోదు చేసింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. టీమిండియా కనుక వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే రాహుల్‌ను పర్మినెంట్ కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎలాంటి అద్భుతం కావాలన్నా రాహుల్ సాధించి పెడతాడని, తను చాలా అండర్ రేటెడ్ కెప్టెన్ అని ఫ్యాన్స్ అంటున్నారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తూ అందరిలో బెస్ట్‌ను బయటకు తీసుకొచ్చే ట్యాలెంట్ రాహుల్‌కు ఉందని మెచ్చుకుంటున్నారు.