Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత జట్టు రెడీ అవుతోంది. గువాహతి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం నాడు జరిగే ఈ మ్యాచులో కూడా గెలిచి సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ అనుకుంటోంది. అదే సమయంలో వరుసగా రెండు పరాజయాల తర్వాత ఎలాగైనా విజయం సాధించాలని ఆసీస్ కూడా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మూడో టీ20లో కొన్ని అంశాలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటంటే?
కెప్టెన్‌గా తొలి సిరీస్..
టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. తను ఆడటంతోపాటు కెప్టెన్సీలో కూడా తనదైన మార్కు చూపించిన అతను.. వరుసగా రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మూడో మ్యాచ్ కూడా గెలిస్తే.. కెప్టెన్‌గా ఆడిన తొలి సిరీసును ఖాతాలో వేసుకొనే ఛాన్స్ ఉంది. భారత్‌కు సారధ్యం వహించే అవకాశం రావడమే అరుదు. మరి ఆ అవకాశం వస్తే దాన్ని మరపురాని అనుభూతిగా మార్చుకోవాలనే అందరూ చూస్తారు కదా. సూర్యకు ఆ అవకాశం దక్కాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.
వరల్డ్ కప్ హీరో రీఎంట్రీ?
భారత్‌తో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్ తమ పూర్తి బలమైన జట్టుతో బరిలో దిగలేదు. వన్డే వరల్డ్ కప్ తర్వాత తమ ప్లేయర్లకు ఆసీస్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అయితే రెండో మ్యాచులో మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, స్టొయినిస్ తదితరులు ఆడారు. కానీ వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ ఇంకా జట్టులోకి రాలేదు.

అయితే అతను మూడో మ్యాచులో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అతను కనుక తిరిగొస్తే.. భారత పేసర్లకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆరంభ ఓవర్లలో భారత పేసర్లు తడబడుతున్నారు. ఆ సమయంలోనే హెడ్ చెలరేగుతాడు. అంతేకాదు, నిదానంగా ఆడుతున్న స్మిత్‌ను హెడ్ రిప్లేస్ చేసే అవకాశం ఉంది.
గైక్వాడ్ స్థానానికి ఎసరు!
ఆసీస్‌తో చివరి రెండు మ్యాచులకు శ్రేయాస్ అయ్యర్ తిరిగొస్తున్నాడు. అతను వస్తే జట్టు వైస్ కెప్టెన్సీ కూడా అయ్యర్‌కే ఇచ్చేస్తారు. దీంతో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానం ప్రమాదంలో పడనుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో గైక్వాడ్ అంత గొప్పగా ఆడలేదు. ముఖ్యంగా అతని స్ట్రోక్ ప్లే ఆశించిన స్థాయిలో లేదు.

అయ్యర్ ఎటూ టాపార్డర్‌లో ఆడాల్సిందే. అతని కోసం కిషన్‌ను పక్కన పెట్టడం కుదరదు. కాబట్టి గైక్వాడ్‌ను పక్కన పెట్టేయాలని మేనేజ్‌మెంట్ చూస్తోంది. వాళ్ల అభిప్రాయం మార్చాలంటే గైక్వాడ్ ఈ మ్యాచులో తప్పనిసరిగా రాణించాల్సి ఉంటుంది.