వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు దక్కింది.
అదే సమయంలో చాలాకాలం నుంచి జట్టులో రెగ్యులర్ స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్‌కు మరోసారి సెలెక్టర్లు మొండి చెయ్యి చూపారు. ఇటీవలి కాలంలో టీమిండియాకు ఆడే అవకాశం వచ్చిన ప్రతి సిరీసులో సంజూ రాణించాడు. అయినా సరే అతన్ని మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు.

అయితే అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ చేస్తున్నామని, అందుకే వన్డేలు ఆడిస్తున్నామని టీం మేనేజ్‌మెంట్ చెప్పింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో సడెన్‌గా ప్లాన్ మార్చేసి అతన్ని వన్డే వరల్డ్ కప్ కాదు.. టీ20ల్లోనే ఆడించాలని డిసైడ్ అయింది. అతన్ని ఆసియా కప్‌లో ఆడిస్తారని అనుకుంటే.. ఆ టోర్నీకి కూడా ఎంపిక చేయలేదు.
దీంతో కనీసం ఆసియా క్రీడలకు పంపుతారని అనుకున్నారు. సెలెక్టర్లు ఈ జట్టులో కూడా సంజూకు మొండిచెయ్యి చూపారు. ఇప్పుడు వరల్డ్ కప్ ఓడిన తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో కూడా సంజూను ఎంపిక చేయలేదు. ఇదంతా చూసిన ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది.
'సంజూ.. మా మాట విని రిటైర్ అయిపో. ఏ నెదర్లాండ్స్‌కో వెళ్లి 2027 వరల్డ్ కప్‌లో టీమిండియాకు వ్యతిరేకంగా ఆడు' అంటూ కొందరు ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్లనే అతనికి జట్టులో చోటు దక్కడం లేదని, ఎన్ని ఐసీసీ టోర్నీలో చేజారినా సెలెక్టర్లకు మాత్రం బుద్ధి రావడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఏం చేస్తే అతనికి జట్టులో చోటు దక్కుతుందో చెప్పాలని నిలదీస్తున్నారు.