వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా కీలకమైన మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. అయితే ఈ సిరీస్ తొలి రెండు మ్యాచులకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం ఎంత వరకు సమంజసం? అని పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
వరల్డ్ కప్ ముందు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడటమే ముఖ్యమని కొందరు వాదిస్తున్నారు. మరికొందరైతే అసలు ఆసీస్‌తో సిరీసే దండగ అంటున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్‌కు విశ్రాంతి ఇవ్వడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పెదవి విప్పాడు. వారిద్దరితో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రావిడ్ పలు విషయాలు పంచుకున్నాడు. అసలు సీనియర్లకు ఇంతలా బ్రేక్స్ ఇవ్వడం అవసరమా? అని వినిపిస్తున్న ప్రశ్నలకు ద్రావిడ్ బదులిచ్చాడు. వరల్డ్ కప్‌లో వారు ఫ్రెష్‌గా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
'విరాట్, రోహిత్ వంటి వాళ్ల విషయంలో మాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ నుంచే వాళ్లు ఫిజికల్‌గా, మెంటల్‌గా తమ బెస్ట్ పొజిషన్‌లో ఉండాలి. దానికే మేం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో వారికి చాలా అనుభవం ఉంది. తమను తాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. టీం అంతా కలిసి చర్చించిన తర్వాతనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం' అని ద్రావిడ్ చెప్పాడు.
'వాళ్లిద్దరితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ డెసిషన్ తీసుకోలేదు. అయితే సీనియర్లు, అనుభవం ఉన్న ఆటగాళ్లకు తమ రొటీన్ ఏంటో బాగా తెలుసు. వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సరైన మైండ్ సెట్‌తో దిగడానికి ఏం చేయాలో వాళ్లకు ఐడియా ఉంది' అని పేర్కొన్నాడు. ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులో రోహిత్, కోహ్లీ, హార్దిక్, కుల్దీప్ నలుగురికీ ఆసీస్‌తో తొలి రెండు మ్యాచుల్లో విశ్రాంతి ఇచ్చారు.
ఇక అక్షర్ పటేల్ గాయంతో ఈ సిరీసుకు దూరమైన సంగతి తెలిసిందే. 'వరల్డ్ కప్ ముందు ఎలా ప్రిపేర్ అవుతారని మేం వాళ్లను అడిగాం. ఈ చర్చలోనే తొలి రెండు వన్డేల్లో వాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో వాళ్లు మెంటల్‌గా రీఫ్రెష్ అవుతారనే ఇలా చేశాం. రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచులో మళ్లీ వాళ్లు ఆడతారు. ఆ తర్వాత మేం చాలా కష్టపడాల్సిన టైం వచ్చేస్తుంది' అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.