ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ టీ20 సిరీస్‌తో పర్యటనను ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో గురువారం నాడు సఫారీ పర్యటనకు జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీసులో కూడా రోహిత్ శర్మను ఆడించాలని ప్రయత్నాలు చేస్తోంది.
సౌతాఫ్రికాతో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. ముందుగా టీ20లు జరుగుతాయి. ఈ సిరీసులో భారత జట్టు సారధిగా రోహిత్‌ను ఎంపిక చేయాలని చూస్తున్న బీసీసీఐ.. అతన్ని దీని కోసం ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందట. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంగతి తెలిసిందే.

ఇక తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న రోహిత్.. సౌతాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీసుకు దూరంగా ఉండాలని అనుకున్నాడట. విరాట్ కోహ్లీ కూడా ఇదే నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ లేకపోతే సాధారణంగా టీ20లు, వన్డేల్లో జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. అయితే మడమ గాయంతో అతను ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.
సఫారీలతో జరిగే టీ20 సిరీస్ నాటికి పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించడం అనుమానమే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీసులో కూడా రోహిత్, పాండ్యా ఇద్దరూ ఆడటం లేదు. దీంతో జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారధ్యం వహిస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీసులో కూడా అతనే జట్టుకు కెప్టెన్సీ నిర్వహిస్తాడని సమాచారం. అయితే సఫారీ గడ్డపై కెప్టెన్సీ అంత ఈజీ కాదు.
అందుకే రోహిత్‌ను ఎలాగైనా ఒప్పించి, టీ20 సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక కోహ్లీ మాత్రం ఈ సిరీసులో టీ20లతోపాటు వన్డేలకు కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా అతను స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది.