వరల్డ్ కప్ ఓటమిని పూర్తిగా మర్చిపోక ముందే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా రెడీ అయిపోయింది. ఈ సిరీసులో సీనియర్ ప్లేయర్లు అందరికీ విశ్రాంతి ఇచ్చిన టీం మేనేజ్‌మెంట్.. కుర్రాళ్లతో కూడిన జట్టును బరిలో దింపుతోంది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
వీరిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్ కప్ జట్టులో ఉన్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. వాళ్లే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ. హార్దిక్ పాండ్యా రిప్లేస్‌మెంట్‌గా వరల్డ్ కప్ జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మిగతా అందరూ కూడా ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి వచ్చిన జట్టులోని సభ్యులే కావడం గమనార్హం. తిలక్ వర్మతోపాటు విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్, గోల్డ్ మెడల్ టీంకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టులో ఉన్నారు. అందరూ అనుకుననట్లే ఈ టీంకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ నియమించింది.
అతని డిప్యూటీగా రుతురాజ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేశారు. అతనితోపాటు ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే ఈ జట్టులో సంజూ శాంసన్ లేకపోవడం మరోసారి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. సంజూపై ఇంత పగ పెంచుకున్నారేంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు జట్లు మొత్తం ఐదు టీ20 మ్యాచులు ఆడనున్న సంగతి తెలిసిందే.
భారత బృందం: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్