
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ముందంజలో ఉంది. తొలి రెండు టెస్టుల్లో ఘనవిజయాలు నమోదు చేసిన టీమిండియా ఈ ట్రోఫీని రిటైన్ చేసుకుంది. దీంతో కంగారూలకు మరోసారి నిరాశే మిగిలింది. అదే సమయంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడానికి కూడా భారత జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇండోర్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో కనుక భారత్ గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
అదే సమయంలో తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఎలాగైనా మూడో మ్యాచులో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చేరడంతో ఈసారి ఆసీస్ జట్టు బలంగా కనిపిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌లో తయారు చేస్తున్న పిచ్‌ల గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
నాగ్‌పూర్, ఢిల్లీల్లో స్పిన్‌కు సహకరించే పిచ్‌లు తయారు చేయడంపై ఆసీస్ మీడియా విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఎలాంటి పిచ్ తయారు చేస్తారనే ఆసక్తి నెలకొంది.
ఇండోర్ పిచ్ మధ్యలో కొంత గడ్డి ఉంది. ఇది ఉన్నంత సేపు పిచ్ నుంచి బ్యాటర్లకు సహకారం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే పేసర్లు కూడా ఈ పిచ్ నుంచి కొంత మూవ్‌మెంట్ పొందుతారట. అంతేకాదు, ఈ పిచ్‌పై ఏమాత్రం పగుళ్లు లేవు.
దీంతో మొదటి రోజు నుంచే స్పిన్నర్లకు సహకారం లభించదు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పటి లాగే ఈ పిచ్ బ్యాటర్లకు సహకరించేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీసులో భారీ స్కోర్లు నమోదు కాలేదు. ఇప్పుడు ఇండరో పిచ్ చూస్తుంటే భారీ స్కోర్లు కచ్చితంగా నమోదయ్యేలా ఉన్నాయి.