

న్యూ ఢిల్లీ: భారత్.. వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న టోర్నీ వేదికల విషయంలో కొద్ది పాటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత్, వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 23న జరిగే రెండో వన్డే వేదిక ఇండోర్ నుంచి మరో చోటికి తరలించే అవకాశం కనిపిస్తోంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం మధ్య వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం.
బీసీసీఐ కొత్త రాజ్యంగం ప్రకారం స్టేడియంలోని మొత్తం టికెట్లలో 90 శాతం విక్రయానికి ఉంచాలి. అంటే కేవలం 10 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లు మాత్రమే రాష్ట్ర సంఘం వద్ద ఉంటాయి. హోల్కర్ స్టేడియం సామర్థ్యం 27,000. అంటే 2,700 మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు. ప్రకటనదారులు, ప్రాయోజితదారుల కోసం బీసీసీఐ ఈ కోటాలో భాగం అడుగుతుండటమే వివాదానికి కారణం.
బీసీసీఐ తమ డిమాండ్‌ను వెనక్కి తీసుకోకపోతే ఇండోర్‌లో రెండో వన్డే నిర్వహించడం సాధ్యంకాదని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి మిలింద్ కన్మదికర్ అన్నారు. 7000 హాస్పిటాలిటీ టికెట్లలో 700 మాత్రమే తమకు ఉన్నాయన్నారు. ఇందులోనూ బీసీసీఐకి కేటాయిస్తే తమకు మిగిలేది కేవలం 350 అని, అవి ఎందుకూ సరిపోవన్నారు. ఈ నేపథ్యంలో కన్మదికర్ కావాలనే బెదిరింపులకు దిగుతున్నారని బీసీసీఐలోని ఓ అధికారి ఆరోపించారు.
ప్రస్తుత వివాదం టికెట్ల కోసం కాదని మరో విషయం కోసమని గుసగుసలు వినిపించడం గమనార్హం. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు రాజ్ కోట్ వేదికగా, రెండో టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఉంటాయి. తొలి టెస్టు రాజ్‌కోట్ వేదికగా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనుంది.